Andhra Pradesh: వినియోగదారులూ.. గ్యాస్ డెలీవరీ బాయిస్ కు టిప్ ఇవ్వకండి: ఏపీ మంత్రి ప్రత్తిపాటి

  • గ్యాస్ బిల్లులో నమోదు చేసిన ధర మాత్రమే చెల్లించాలి
  • డెలివరీ ఛార్జీలను ఆయిల్ కంపెనీలు చెల్లిస్తాయి
  • అదనంగా వసూలు చేస్తే డీలర్లపై కఠిన చర్యలు తప్పవు 

గ్యాస్ డెలీవరీ బాయిస్ టిప్ డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాలు వస్తున్నాయని, వారికి టిప్ లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో ఈరోజు సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి ప్రభుత్వ రంగ ఎల్పీజీ సంస్థల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, రాష్ట్రంలోని ఎల్పీజీ డీలర్ల ప్రతినిధులతో గ్యాస్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. గ్యాస్ డెలీవరీ బాయిస్ కు గ్యాస్ డీలర్లు జీతాలు ఇస్తారు కనుక ఎటువంటి టిప్స్ ఇవ్వక్కర్లేదని చెప్పారు.  

గ్యాస్ డోర్ డెలివరీ ఛార్జీలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెల్లిస్తాయని, బిల్లులో నమోదు చేసిన ధర మాత్రమే చెల్లించాలని, అదనంగా చెల్లించవద్దని వినియోగదారులకు తెలియజేయాలని, అదనంగా వసూలు చేస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి ఆదేశించారు. గ్యాస్ డెలీవరీ బాయిస్ తమ వెంట తూనిక మిషన్ తీసుకువెళ్లి వినియోగదారుని సమక్షంలో తప్పనిసరిగా గ్యాస్ సిలండర్ ని తూకం వేసి ఇవ్వాలని, ఈ విషయమై కూడా వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

గిరిజన ప్రాంతాల్లో ఏజన్సీలు తక్కువగా ఉన్నాయని, అక్కడ ఏజన్సీల సంఖ్యను పెంచాలని, డీలర్ల వద్దకు వెళ్లి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? ఎంత మంది డెలివరీ బాయిస్ ఉన్నారు? ఎన్ని తూనిక మిషన్లు ఉన్నాయో తనిఖీ చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని డీలర్ల సంఖ్య, వారి వద్ద ఉంటే డెలివరీ బాయిస్, తూనిక మిషన్ల వివరాలను ఆగస్ట్ 14వ తేదీ లోపల తమకు అందజేయాలని, వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని సేవలు అందించాలని ఆదేశించారు. దీపం కనెక్షన్ వినియోగదారులకు రెండో సిలిండర్ ఇవ్వాలని ప్రత్తిపాటి ఆదేశించారు. ఒక్క సిలండర్ మాత్రమే ఇస్తున్నందున, పూర్తిగా గ్యాస్ వినియోగించుకోకుండానే వినియోగదారులు మరో సిలిండర్ తీసుకుంటున్నారని, అలా తీసుకోవడం వల్ల తిరిగి ఇచ్చే సిలిండర్ లో 1 నుంచి 2 కిలోల గ్యాస్ మిగిలిపోతోందని, తద్వారా వినియోగదారులు నష్టపోతున్నారని అన్నారు.

గ్యాస్‌ను నిర్దేశించిన ధరకు సరైన తూకంతో వినియోగదారులకు అందుతుందా? లేదా? అన్నది  ప్రభుత్వం రంగ సంస్థల అధికారులు, పౌరసరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారుల ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిరంతరం తనిఖీలు చేయాలని, అవకతవకలు జరిగినట్లు తేలితే తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్యాకేజీ కమోడిటీస్ నిబంధనల ప్రకారం సరఫరా కంపెనీ పేరు, అడ్రస్, ఎంఆర్పీ, ప్యాకింగ్ తేదీ, గ్యాస్ పరిమాణం మొదలైన తప్పనిసరి వివరాలను ప్రతి సిలెండర్‌పై కనిపించేలా లేబుల్స్ అతికించాలని అయిల్ కంపెనీల ప్రతినిధులను ప్రత్తిపాటి ఆదేశించారు. భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సిలిండర్లలో మాత్రమే గ్యాస్ నింపాలని, కాలం చెల్లిన సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయొద్దని అన్నారు. గ్యాస్ పంపిణీ, అదనపు వసూళ్లు, తూకం వేయకుండా సిలిండర్ల డెలివరీ వంటి అంశాలకు సంబంధించి 1100 కు ఫిర్యాదు చేయాలని ప్రత్తిపాటి వినియోగదారులను సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ ఎల్.పీ.జీ.సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, మంత్రి ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామని, ఆగస్ట్ 14 నాటికి మంత్రి అడిగిన అన్ని వివరాలు అందజేస్తామని చెప్పారు.  9 ఫిల్లింగ్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ విధానం అమలులోకి వచ్చిందని, సిలిండర్లకు 5 సంవత్సరాలకు ఒకసారి రంగువేయిస్తున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ విడుదల చేశామని, గిరిజన ప్రాంతాల్లో అదనంగా డీలర్లను నియమిస్తామని, కొన్ని చోట్ల డీలర్లకు సొంత స్థలం లేక ఆగిపోయినట్లు తెలిపారు. దీపం కనెక్షన్ వారికి రెండో సిలిండర్ ఇస్తామని చెప్పారు.  

More Telugu News