mallikarjuna kharge: ఏపీ ప్రజల డిమాండ్ కు కాంగ్రెస్ పూర్తి స్థాయి మద్దతు: మల్లికార్జున ఖర్గే

  • ఏపీ ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం చేస్తాం
  • మీడియా అంతా మోదీకి అనుకూలంగా ఉంది
  • మీడియాకు మోదీ భజనే సరిపోతోంది

ఏపీ ప్రజల డిమాండ్ కు కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్ఎస్పీ, ముస్లింలీగ్ పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడుతూ, అవిశ్వాసానికి సంబంధించి టీడీపీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, అందరూ ప్రస్తావించారని, ఈ తీర్మానానికి అంగీకరించి సభ్యులకు అవకాశం కల్పించిన స్పీకర్ కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. విభజన చట్టంలోని 5 అంశాలకు సంబంధించి .. ప్రత్యేక హోదా, లోటు భర్తీ, గ్రాంట్లు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, ఏడు మండలాల విలీనం గురించి స్పష్టంగా చెప్పామని అన్నారు.

హైదరాబాద్ ను కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నామని, రాజ్యసభ వేదికగా ఏపీకి అప్పటి ప్రధాని ఆరు విషయాల్లో హామీలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న జైట్లీ ఆరు విషయాలపై సంతృప్తి వ్యక్తం చేసి.. సవరణలు వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ప్రస్తుతం మీడియా అంతా మోదీకి అనుకూలంగా ఉందని, ఆయన ప్రకటనలకు ప్రాధాన్యత ఇస్తోందని, ‘మీడియాకు మోదీ మోదీ’ అన్న భజనే సరిపోతోందని ఆరోపించారు.

More Telugu News