rajnath: చంద్రబాబు మాకు ఇప్పటికీ మిత్రుడే: రాజ్ నాథ్ సింగ్

  • విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశాం
  • ఏపీ, తెలంగాణ అభివృద్ధికి సాయం చేస్తూనే ఉంటాం
  • సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక రాష్ట్రాలు అని ఉండవు

ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయినా చంద్రబాబు తమకు ఇప్పటికీ మిత్రుడేనని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాతపాటే పాడారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశామని, రాజధాని కోసం రూ.1500 కోట్లు ఇచ్చామని, గుంటూరు, విజయవాడ కోసం రూ. వెయ్యి కోట్లు, పోలవరానికి రూ.6,750 కోట్లు ఇచ్చామని, వెనుకబడిన జిల్లాలకు రూ.1,050 కోట్లు ఇచ్చామని.. ఇంకా ఇస్తామని అన్నారు.

14వ ఆర్థిక సంఘం ఏపీకి 2020 వరకు రూ.22,113 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని చెప్పిందని అన్నారు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి సాయం చేస్తూనే ఉంటామని చెప్పారు. రాష్ట్రాలకు 42 శాతం వాటాలో భాగంగా 2020 నాటికి ఏపీకి రూ.2 లక్షల 6 వేల 900 కోట్లు అందుతాయని, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక రాష్ట్రాలు అని ఉండవని, ఆర్థికలోటును పూడ్చేందుకు 2015 మార్చి వరకు 4,100 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇచ్చామని అన్నారు. ఒక రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం ఏం చేయగలదో అంతకు మించి చేశామని అన్నారు.

More Telugu News