Rahul Gandhi: నిజాలను విని భయపడకండి!: రాహుల్ గాంధీ

  • బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ తీవ్ర ఆరోపణలు
  • దేశంలో మహిళలకు రక్షణ లేదు
  • ప్రజలు రక్షణ కోల్పోతున్నా ప్రధాని భరోసా ఇవ్వలేరా?

నిజాలను విని భయపడకండి, పది, పదిహేను మంది వ్యాపారవేత్తల కోసం బ్యాంకుల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు మాఫీ చేయించారని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, దేశంలో మహిళలకు రక్షణ లేదని భారతదేశం గురించి తొలిసారి ప్రపంచం అనుకుంటోందని అన్నారు. సామూహిక అత్యాచారాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నామని, ప్రపంచం ముందు చులకనవుతున్నామని అన్నారు. ఇలాంటి పరిస్థితి దేశ చరిత్రలో ఎన్నడూ లేదని, దేశ ప్రజలు రక్షణ కోల్పోతున్నా ప్రధాని మోదీ భరోసా ఇవ్వలేరా? ఇన్ని జరుగుతున్నా ప్రధాని నోటి నుంచి ఒక్కమాట కూడా బయటకు రాదని మండిపడ్డారు.

ఎక్కడ, ఎటువైపు చూసినా దేశంలో ఎవరో ఒకరు అణచివేతకు గురవుతున్నారని, ఇలాంటి పరిణామాలు దేశానికి గౌరవాన్ని పెంచవని రాహుల్ అన్నారు. వీటన్నింటిపైనా మోదీ మనసులో ఏముందో ప్రజలకు చెప్పాలని, ప్రధాని, అమిత్ షా ఇద్దరూ ప్రత్యేక తరహాకు చెందిన రాజకీయ నాయకులేనన్న రాహుల్, తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఉండగలం కానీ, అధికారం లేకపోతే ప్రధాని మాత్రం బతకలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షాలిద్దరూ ఇతరులెవరినీ మాట్లాడనీయరని, భయపెడతారని, ప్రతిపక్షంలో భయం లేదని, అధికార పక్షంలోనే భయం ఉందని వ్యాఖ్యానించారు.

మోదీ, ఆయన పరివారం ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రధాని, ఆర్ఎస్ఎస్ కలిసి దేశ ప్రజలకు కాంగ్రెస్ అవసరాన్ని మరింత పెంచారని, తామేమి చేయాలన్న అంశంపై మరింత స్పష్టత ఇచ్చారని, ఇంత గొప్ప సాయం చేసినందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘నేనంటే మీకు ద్వేషం, కోపం, శత్రుత్వం వున్నాయి. నేను మీకు అసమర్ధుడిని, పప్పుని.. మీరేమైనా అనుకోండి. మీరేమైనా అనండి.. నాకు మీపై కించిత్తు ద్వేషం గానీ, అసూయ గానీ లేవు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

More Telugu News