Akhilesh yadav: వచ్చే ఎన్నికల తర్వాత దేశానికి కొత్త ప్రధాని.. అది కూడా యూపీ నుంచే!: మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్

  • ఈ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు 
  • నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిపై ఆగ్రహంగా వున్నారు
  • మహా కూటమిని మోదీ ఎగతాళి చేస్తున్నారు

రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశానికి కొత్త ప్రధాని వస్తారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. అది కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. మరి, ప్రధాని అభ్యర్థి పదవి కోసం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారా? లేక, మాయావతికా? అన్న ప్రశ్నకు మాత్రం అఖిలేశ్ సమాధానం దాటవేశారు. ‘‘2019 ఎన్నికల తర్వాత మీరు కొత్త ప్రధానిని చూడబోతున్నారు’’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు.

‘‘ఈ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు వారిని కలవరపెడుతున్నాయి. నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు’’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. మహాకూటమిని ప్రధాని ఎగతాళి చేస్తున్నారని, కానీ ఆయన కూడా సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్నారన్న సంగతి గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.

మధ్యప్రదేశ్‌‌లో కాంగ్రెస్, బీఎస్పీతో పొత్తు విషయమై అఖిలేష్ మాట్లాడుతూ తాము చాలా పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ అంటే తనకెంతో గౌరవం అన్నారు. చాలా విషయాలు చర్చించామని, అయితే, వాటిని ఇప్పుడు బయటపెట్టబోనన్నారు.

More Telugu News