dokka maninkya varaprasad: దేశ రాజకీయాల్లో రేపు అరుదైన సంఘటన జరగబోతోంది: డొక్కా మాణిక్య వరప్రసాద్

  • రేపు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ
  • ఇది ప్రధాని మోదీకి అగ్నిపరీక్ష
  • సీఎం చంద్రబాబు దేశానికి అజెండా ఫిక్స్ చేశారు

దేశ రాజకీయాల్లో రేపు అరుదైన సంఘటన జరుగబోతోందని, ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అగ్నిపరీక్ష అని ఏపీ ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఏపీ సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశానికి అజెండా ఫిక్స్ చేశారని, టీడీపీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరగబోతుందని చెప్పారు.

పార్లమెంటు చట్టంపై మోదీకి గౌరవం ఉందో లేదో, దానిని అమలు చేస్తారో లేదో తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని, రాజకీయాలకు అతీతంగా అందరి మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ టీడీపీని టార్గెట్ చేయడం దురదృష్టకరమని, విభజన చట్టం అమలు చేసి పార్లమెంటుపై గౌరవం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. హామీలు అమలు చేస్తే కేంద్రానికి, మోదీకి మంచిదని, ప్రజాస్వామ్యంపై గౌరవం పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సంతోషిస్తారని చెప్పారు.  

దేశవ్యాప్తంగా బీజేపీ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతోందని, పాదయాత్రల కంటే పార్లమెంటు పవిత్రమైందనే విషయాన్ని వైసీపీ గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఉంటే రేపటి అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనేవారని, ఆ అవకాశం వారు కోల్పోయారని అన్నారు. పాదయాత్ర, ఓదార్పు యాత్రల కంటే పార్లమెంటు పవిత్రమైందని చెప్పారు. అవిశ్వాసానికి అందరి మద్దతు కావాలని, ఇంతకు ముందు మద్దతు తెలుపుతామని ప్రకటించినవారు కూడా ముందుకు రావాలని డొక్కా విజ్ఞప్తి చేశారు.

More Telugu News