jagan: జగన్ డ్రామా బట్టబయలైంది: యనమల

  • అవిశ్వాస తీర్మానం చర్చకు రావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది
  • ఒడ్డున పడ్డ చేపలా వైసీపీ పరిస్థితి తయారైంది
  • ఏ1 ముద్దాయి జగన్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ చర్చకు స్వీకరించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి యనమల అన్నారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఒడ్డున పడిన చేపలా తయారైందని ఎద్దేవా చేశారు. అవిశ్వాసంపై చర్చలో పాల్గొనకుండా బీజేపీతో కలసి జగన్ ఆడిన నాటకం బట్టబయలైందని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైందని చెప్పారు. కేసుల నుంచి బయటపడటమే జగన్ లక్ష్యమని మండిపడ్డారు. బీజేపీ కనుసన్నల్లోనే జగన్ నడుచుకుంటున్నారని విమర్శించారు. ప్రజా ధనాన్ని దోచుకుని, ఎన్నో కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్... అవినీతి గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

కాకినాడలో పర్యటించిన జగన్... అక్కడ పెట్టాలనుకున్న పెట్రో కాంప్లెక్స్ పై ఎందుకు మాట్లాడలేదని యనమల ప్రశ్నించారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కు రూ. 5,615 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం అనడాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. అసలు సొంత జిల్లాకే న్యాయం చేయలేని జగన్... రాష్ట్రానికి ఏ విధంగా నాయకత్వం వహిస్తాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ చేస్తున్న అన్యాయం జగన్ కు కనిపించడం లేదా? అని అన్నారు. జగన్ లాంటి బాధ్యతారాహిత్యం కలిగిన నేతను తాను ఎక్కడా చూడలేదని చెప్పారు.

More Telugu News