jc diwakar reddy: నేను అలిగితే నా పెళ్లాం మీదే అలగాలి!: జేసీ దివాకర్ రెడ్డి

  • అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేదేమీ లేదు
  • మోదీ ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు
  • సభలో నేను లేకున్నా.. టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తారు

పార్లమెంటు సమావేశాలకు తాను హాజరు కావడం లేదంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ జరగనున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పార్టీపై ఆయన అలకబూనారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాను అలకబూనాలంటే తన పెళ్లాంపైనే అలకబూనాలని తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు. అలక లేదు.. పలక లేదు అన్నారు.

నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం ఏపీకి ఏమీ రాదనే విషయాన్ని తాను గత నాలుగేళ్లుగా చెబుతూనే ఉన్నానని... ఇప్పుడు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో కూడా సాధించేదేమీ లేదని జేసీ చెప్పారు. అవిశ్వాస తీర్మానం వల్ల కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని అన్నారు. అయితే, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రం చేయవచ్చని చెప్పారు.

దివాకర్ రెడ్డి పార్లమెంటులో ఉన్నా, లేకున్నా టీడీపీ ఎంపీలంతా కలసికట్టుగా పోరాటం చేస్తారని తెలిపారు. తాను పార్లమెంటుకు వెళ్లినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని అన్నారు. తాను ఎలాంటి కసితో లేనని... చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాలకు తాను హాజరుకానని స్పష్టం చేశారు. దేశ రాజకీయాలు ఏమాతం బాగోలేవని... అందుకే విప్ జారీ చేసినా తాను వెళ్లడం లేదని చెప్పారు. 

More Telugu News