Uttar Pradesh: తమ్ముడి మరణానికి ప్రతీకారం.. మధ్యాహ్న భోజనంలో విషం కలిపిన ఏడో తరగతి బాలిక!

  • తమ్ముడికి హత్యకు ప్రతీకార చర్య 
  • ఉడుకుతున్న పప్పులో విషం కలిపిన చిన్నారి
  • బాలిక జువైనల్ హోంకి తరలింపు 

చిన్నారుల్లో నేర ప్రవృత్తి ఎంతలా పెరిగిపోతుందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏడో తరగతి చదువుతున్న బాలిక చేసిన పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఏకంగా స్కూలు మధ్యాహ్న భోజనంలో విషం కలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని బంకట పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌలియా గ్రామంలో జరిగిందీ ఘటన.

బాలికపై డియోరియో పోలీసులు సెక్షన్ 328 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని, జువైనల్ హోంకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం మూడో తరగతి చదువుతున్న బాలిక సోదరుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో మృతి చెందాడు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒకరు విసిరిన రాయి బాలుడి తలకు బలంగా తాకడంతో చిన్నారి మృతి చెందాడు. అతడి మృతికి కారణమైన ఐదో తరగతి విద్యార్థిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు.

తన సోదరుడిని చంపిన వారిపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న బాలిక మధ్యాహ్నం భోజనం కోసం వండుతున్న పప్పులో విష పదార్థాలను కలిపింది. ఈ భోజనాన్ని ఎవరూ తినకపోవడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆహారం కల్తీ కాలేదని తేలింది. అందులో ఎటువంటి విషపదార్థాలు లేవని తేల్చారు. మరోవైపు, ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామని, నివేదిక రావడానికి రెండు మూడు రోజులు పడుతుందని పోలీసులు తెలిపారు.

బాలిక చేతుల నుంచి వాసన వస్తుండడాన్ని గమనించిన కుక్ అనుమానించాడు. ఆ వెంటనే ఉడుకుతున్న పప్పుపైన తెల్లని పొర ఏర్పడడంతో అనుమానించి బాలికను నిర్బంధించి ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించాడు. విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున స్కూలుకు చేరుకుని బాలిక తల్లిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని తల్లి, కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News