NSE: ఇక ఎన్ఎస్ఈ నుంచీ క్రూడాయిల్, మెటల్ ఫ్యూచర్ ట్రేడింగ్!

  • అక్టోబర్ 1 నుంచి ప్రారంభం
  • దశలవారీగా పలు ప్రొడక్టులపై ట్రేడింగ్
  • వచ్చే వారం నుంచి నమూనా ట్రేడింగ్

భారత స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న లోహ, ఇంధన ఉత్పత్తుల ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ఎన్ఎస్ఈలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం వచ్చే వారం నుంచి సభ్యులు నమూనా ట్రేడింగ్ ను ప్రారంభించవచ్చని ఎన్ఎస్ఈ వర్గాలు వెల్లడించాయి. దశలవారీగా ప్రొడక్టుల ట్రేడింగ్ ప్రారంభమవుతుందని ఏ ప్రొడక్ట్ పై ఎప్పటి నుంచి ఫ్యూచర్ కాంట్రాక్టు లావాదేవీలు ప్రారంభించాలన్న విషయమై సెబీ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు.

ఇక బంగారం, వెండి కాంట్రాక్టులను అహ్మదాబాద్ ధరల ఆధారంగా, ఫ్రాథమిక లోహాల ఫ్యూచర్స్ లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ ధరల ఆధారంగా, ముడి చమురు కాంట్రాక్టులను దుబాయ్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ధరల ఆధారంగా సెటిల్ మెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో జరుగుతున్న క్రూడాయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ లో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ ధరల ఆధారంగా ప్రస్తుతం సెటిల్ చేస్తున్నారు.

కాగా, భవిష్యత్తులో వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తుల కాంట్రాక్టుల ఫ్యూచర్ ట్రేడింగ్ నూ ఎన్ఎస్ఈ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. దీనిపై 2019లో సెబీ నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News