Hyderabad: బుధవారం నరకం చూసిన భాగ్యనగర వాసులు.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్!

  • బుధవారం నగరంలో రెండుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
  • 13 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
  • ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలు

బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఒక్కసారిగా స్తంభించింది. వేలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటలపాటు వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో పంజగుట్టలోని గ్రీన్‌ల్యాండ్స్ వంతెనపై 14 టైర్లు ఉన్న జీహెచ్ఎంసీ వాహనం యాక్సిల్ విరగడంతో నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పావు గంటలోనే మాదాపూర్-సికింద్రాబాద్ మార్గంలో 13 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.

 మాదాపూర్‌- సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి- మలక్‌పేట మార్గాల్లో ఆటోలు, బస్సులు, ద్విచక్రవాహనాలు పెద్ద ఎత్తున చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలిచిపోయిన జీహెచ్ఎంసీ వాహనాన్ని అతి కష్టం మీద అరగంట తర్వాత మరో చోటికి తరలించారు. ట్రాఫిక్ క్లియర్ అయిందని భావిస్తున్న తరుణంలో బంజారాహిల్స్ లో సిటీ బస్సు బ్రేక్ డౌన్ అయింది. దీంతో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, ఏసీపీ అనిల్ కుమార్ రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించడంతో రాత్రి 8:30 గంటలకు ట్రాఫిక్ సమస్య తీరింది.

More Telugu News