YSRCP: హతవిధీ.. ఏంటిది?.. అవిశ్వాసం విషయంలో అయోమయంలో వైసీపీ

  • రేపే అవిశ్వాస తీర్మానంపై చర్చ
  • విప్ జారీ చేసే అవకాశాన్ని కోల్పోయిన వైసీపీ
  • అనుకూలంగా ఓటేసినా ఏమీ చేయలేని పరిస్థితి

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం వైసీపీకి సంకటంగా మారింది. రేపు (శుక్రవారం) అవిశ్వాసంపై చర్చ జరగనున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ సహా ఆయా పార్టీలన్నీ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ఆ రోజు తప్పనిసరిగా సభకు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని టీడీపీ, కాంగ్రెస్, వ్యతిరేకంగా వేయాలని బీజేపీ విప్‌లు జారీ చేశాయి. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.

వైసీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డితోపాటు, చీఫ్‌విప్‌, ఇతర నాయకులంతా రాజీనామా చేశారు. ఆ పార్టీ నుంచి గెలిచిన కొత్తపల్లి గీత వైసీపీకి దూరంగా ఉంటుండగా, బుట్టా రేణుక, వైఎస్‌పీవై రెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు. వీరిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పుడు అనర్హత వేటు కోసం వాడుకునే ఆయుధాన్ని వైసీపీ కోల్పోయింది.  

మామూలుగా పార్టీ తరపున సభాపక్షనాయకుడు కానీ, చీఫ్‌విప్‌ కానీ విప్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఎంపీల రాజీనామాల కారణంగా ఇప్పుడా రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మిగిలిన వారితో ఇప్పిద్దామన్నా, వారిపై ఇప్పటికే అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు కాబట్టి ఆ అవకాశమూ లేకుండా పోయింది. కాబట్టి పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసే అవకాశాన్ని వైసీపీ కోల్పోయింది.

More Telugu News