ntr: ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ ఫొటోకు దండేసి దండం పెడతారు: చంద్రబాబుపై జగన్ విమర్శ

  • నాడు ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
  • మోదీపై యుద్ధమంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు
  • ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకే మా మద్దతు

నాడు అధికారం కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడు, ఎన్నికలు వచ్చే సమయానికి ఎన్టీఆర్ ఫొటోకు దండేసి దండం పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీపై చంద్రబాబు యుద్ధం చేస్తున్నారని చెప్పడం కేవలం డ్రామాలని విమర్శించారు.

నాడు వైసీపీ ఎన్నిసార్లు అవిశ్వాసం పెట్టినా లోక్ సభ స్పీకర్ అనుమతించలేదని అన్నారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెట్టడం, వెంటనే ఆమోదించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని విమర్శించారు. బయటకేమో బీజేపీతో యుద్ధం చేస్తున్నట్టుగా టీడీపీ నటిస్తోందని, లోపల చూస్తే కాళ్ల బేరమాడుతోందని ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందని, విభజన హామీలను యాక్ట్ లో పెట్టలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే స్థానంలో బీజేపీ ఉండి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.

 ఏపీలో కరెంట్ చార్జీలు పెంచిన కారణంగా కర్నూలు జిల్లాలో నాపరాళ్ల పరిశ్రమలు మూతపడ్డాయని, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలపై రాయల్టీ విపరీతంగా పెంచడంతో ఈ పరిశ్రమలన్నీ మూతపడే స్థాయికి వచ్చాయని, సులభతర వాణిజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతోంది సులభతర వాణిజ్యం కాదని, సులభతర అవినీతి అని తీవ్ర ఆరోపణలు చేశారు.

More Telugu News