Andhra Pradesh: నేను సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లి సీఎంను క‌ల‌వ‌డం త‌ప్పా?: శైల‌జానాథ్

  • సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లి సీఎం, స్పీక‌ర్‌ను కలిశా
  • నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పైనే చ‌ర్చించా
  • నేను  ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే.. పార్టీ మారను

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి శైలజానాథ్ ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ ర‌త‌న్‌తో క‌లిసి శైలజానాథ్ మాట్లాడుతూ, సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లి సీఎం చంద్ర‌బాబును, స్పీక‌ర్‌ను క‌లిశాన‌ని స్ప‌ష్టం చేశారు. ‘నేను మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ప‌లు స‌మ‌స్య‌ల‌పై సీఎంను క‌లిస్తే త‌ప్పేంటి?’ అని ప్రశ్నించారు.  

నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు, త‌న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు, స్పీక‌ర్‌ను క‌ల‌వ‌డం జ‌రిగిందని తెలిపారు. త‌న‌కు రావాల్సిన పింఛ‌న్‌, వైద్య స‌దుపాయ‌ాల‌కు సంబంధించి పెట్టిన బిల్లును తిర‌స్క‌రిస్తున్నట్టు వచ్చిన ఎస్‌.ఎం.ఎస్ ను వారికి చూపించినట్టు చెప్పారు. ఈ విషయం గురించే చంద్ర‌బాబును క‌లిశానని, దీనిపై ఎవ‌రికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘నేను సెక్ర‌టేరియట్ కు వెళితే ఇక్క‌డ‌కు ఎందుకు వ‌చ్చార‌న్నట్టుగా అందరూ న‌న్నే చూస్తున్నార‌ు! నేను కాంగ్రెస వాదిని. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. 2019లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాను’ అని సృష్టం చేశారు. 

More Telugu News