Kumaraswamy: నేనేడిస్తే ఇంత రాద్ధాంతమా?: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • నాకు భావోద్వేగాలు ఉండవా?
  • నేనూ మనిషినేగా..
  • కాంగ్రెస్‌ను నేను ఒక్క మాటైనా అన్నానా?
  • కన్నీళ్లపై కుమారస్వామి వివరణ

తానేదో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తారా? అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఎస్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు కార్చారు. సంకీర్ణం ప్రభుత్వం వల్ల సంతోషంగా ఉండలేకపోతున్నానంటూ కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌కు-జేడీఎస్‌కు మధ్య చెడిందన్న ఊహాగానాలు వినిపించాయి. దీంతో స్పందించిన కుమారస్వామి ఈ విషయం ఇంత పెద్దదిగా కావడానికి మీడియానే కారణమన్నారు.  

తన ప్రసంగంలో ఎక్కడా కాంగ్రెస్‌ను తప్పుబట్టలేదని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమం అంటే కుటుంబ కార్యక్రమం లాంటిదేనని పేర్కొన్న ఆయన ‘‘నా ప్రసంగంలో కాంగ్రెస్‌ను కానీ, ఆ పార్టీ నాయకులను కానీ తప్పుబట్టానా?’’ అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నానని అనుకుంటున్నప్పుడు సహజంగానే కన్నీళ్లు వస్తాయన్న సీఎం.. తాను కూడా భావోద్వేగాలున్న మనిషినేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మీడియాకు సూచించారు.

పార్టీ కార్యక్రమంలో ఆ రోజు దాదాపు గంట సేపు మాట్లాడానని, కానీ కాంగ్రెస్‌ను పల్లెత్తు మాట అనలేదన్నారు. ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు. ‘‘ఇంతమంచి పనిచేస్తుంటే ప్రోత్సాహం లేకపోగా తిరిగి ఇలాంటి ప్రచారమా?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి పనులు చేస్తున్నా ప్రజలు తనపై విశ్వాసం చూపడం లేదన్న భావనే తనతో కన్నీళ్లు పెట్టించింది తప్ప మరోటి కాదని కుమారస్వామి వివరించారు. కాంగ్రెస్ తనను ఇబ్బంది పెట్టడం వల్ల తాను భావోద్వేగానికి గురి కాలేదని తేల్చి చెప్పారు. మీడియా కాస్తా తన కన్నీళ్లను పెద్దవి చేసి చూపించడం వల్ల అది జాతీయ స్థాయికి వెళ్లిపోయిందని ముఖ్యమంత్రి అన్నారు.

More Telugu News