కోర్టు ఆవరణలో అత్యాచార నిందితులను చితకబాదిన న్యాయవాదులు!

17-07-2018 Tue 21:57
  • పదకొండేళ్ల బాలికపై దారుణం
  • ఆమెపై 17 మంది ఏడు నెలల పాటు అత్యాచారం
  • నిందితులకు జ్యుడిషియల్ కస్టడి విధించిన కోర్టు
  • జైలుకు తరలిస్తుండగా నిందితులను చితక్కొట్టిన వైనం
చెన్నైలోని ఓ అపార్టుమెంట్ లో పని చేస్తున్న పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ పదిహేడు మంది నిందితులను లాయర్లు చితకబాదారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... నిందితులు 17 మందిని ఈరోజు మధ్యాహ్నం మద్రాసు హై కోర్టు ఆవరణలోని మహిళా కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం వారిని జైలుకు తరలిస్తుండగా, అక్కడే ఉన్న దాదాపు యాభై మందికి పైగా న్యాయవాదులు వారిని చితకబాదారు.

చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్ లో, ఆ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అక్కడ పని చేసే లిఫ్ట్ బాయ్, భవనం సెక్యూరిటీ గార్డుతో పాటు పలువురు వ్యక్తులు ఆమెపై ఏడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటనను వీడియోలో చిత్రీకరించిన నిందితులు, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే, ఆ బాలిక తనపై జరిగిన ఈ అఘాయిత్యాన్ని తన సోదరికి తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 ఈ మేరకు పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంతో సంబంధమున్న 17 మందిని అరెస్టు చేసి, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు జులై 31 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో, వారిని జైలుకు తరలిస్తుండగా, అక్కడే ఉన్న న్యాయవాదులు, లా కళాశాల విద్యార్థులు నిందితులపై దాడి చేసి చితకబాదారు.

నిందితుల తరపున వాదించం

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల తరపున తాము వాదించబోమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ కృష్ణ ప్రకటించారు. ఈ కేసు వాదించమని న్యాయమూర్తి చెప్పినా కూడా తాము అంగీకరించమని అన్నారు.