ttd: మహా సంప్రోక్షణపై టీటీడీ చైర్మన్ కు అవగాహన లేదు: రమణదీక్షితులు

  • అష్టబంధన మహా సంప్రోక్షణ పవిత్రమైన కార్యక్రమం
  • భక్తులను అనుమతించకూడదనే నిర్ణయం విచారకరం
  • చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు

తిరుమల ఆలయంలో మహా సంప్రోక్షణపై టీటీడీ చైర్మన్ కు అవగాహన లేదని, భక్తులను ఆలయానికి అనుమతించకూడదనే నిర్ణయం సబబు కాదని మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అష్టబంధన మహా సంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 9 నుంచి 16 వరకు శ్రీవారి భక్తులను అనుమతించకూడదని, తిరుమలకు వచ్చే రహదారులు, నడకదారులు మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా విచారకరమని, చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్నారు.

అదేవిధంగా, దేవాలయంలో పని చేసే సిబ్బందిని కూడా సెలవులపై పంపించి వేయాలని, క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలన్నింటిని ఆపివేయాలనే నిర్ణయాలు ఎన్నో సందేహాలకు తావిస్తున్నాయని అన్నారు. గతంలో తాను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రస్తుతం టీటీడీ తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. పన్నెండేళ్లకోసారి  జరిగే ఈ పవిత్రమైన కార్యక్రమంలో భక్తులు పాల్గొనకుండా, వారిని నియంత్రించడం, అసలు తిరుమలలోనే లేకుండా చేయాలని చూడటం విపరీతమైన నిర్ణయాలని అన్నారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదని, భక్తులకు భగవంతుడిని దూరం చేయాలనే ప్రయత్నం తప్పని అన్నారు. ఆలయంలో రహస్యంగా సంప్రోక్షణ పూజలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. స్వామివారికి అపచారం చేయకుండా సంప్రోక్షణ నిర్వహించాలని టీటీడీ అధికారులను కోరారు. 

More Telugu News