vijaysai reddy: రేపట్నుంచే పార్లమెంటు సమావేశాలు.. టీడీపీ తీరుపై విరుచుకు పడ్డ విజయసాయిరెడ్డి!

  • చంద్రబాబు, లోకేష్ లకు ఇంగ్లీష్ రాదు
  • సీఎం రమేష్ ను పార్లమెంటుకు పంపిస్తే... ఆయనకు ఏం అర్థమవుతుంది?
  • సభ సజావుగా జరగడం టీడీపీకి ఇష్టం లేదు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అప్పుడే రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ నేతలు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని... రాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదని... ఆయన కుమారుడు నారా లోకేష్ కు ఇంగ్లీషే కాదు, తెలుగు మాట్లాడటం కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు సీఎం రమేష్ లాంటి వారిని పార్లమెంటుకు పంపిస్తే... ఆయన ఏమి అర్థం చేసుకుంటారని, ప్రజలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగాలని అన్ని పార్టీలు చెప్పాయని... టీడీపీ మాత్రం ఏపీకి కొన్ని సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను సభలో చర్చించాలని చెప్పారని... ఏం చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదని విమర్శించారు. బయట మాత్రం సభను అడ్డుకుంటామని చెప్పుకుంటారని అన్నారు. సభ సజావుగా జరగాలన్న ఆలోచన టీడీపీకి లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వారు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే... ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నది వైసీపీనే అని చెప్పారు.

More Telugu News