Rajinikanth: సినిమా నటుడు రజనీకాంత్ కు ఏం తెలుసు?: పీఎంకే అధినేత అన్బుమణి రాందాస్

  • సినిమావాళ్లకు రాజకీయాలు, ప్రజా సమస్యలపై అవగాహన ఉండదు
  • వాళ్ల గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు
  • ప్రజా సమస్యలపై పోరాడుతున్నది పీఎంకే మాత్రమే

సేలం-చెన్నైల మధ్య ఎనిమిది మార్గాల గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవేకు మద్దతు పలికిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై పీఎంకే అధినేత, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల గురించి రజనీకి ఏం తెలుసని ప్రశ్నించారు. రాజకీయాలు, పరిపాలన పట్ల సినిమావాళ్లకు ఏమాత్రం అవగాహన ఉండదని అన్నారు.

సినిమావాళ్లు ఒక చట్రానికి మాత్రమే పరిమితమై ఉంటారని... వాళ్ల గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవేను చెన్నై, సేలం, కాంచీపురం, ధర్మపురి, తిరువణ్ణామలై, కృష్ణగిరి జిల్లాల ప్రజలు కోరుకోవడం లేదని... ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రమే దాన్ని కోరుకుంటున్నారని, దానికి రజనీ మద్దతు తెలుపుతున్నారని ఎద్దేవా చేశారు.

తమిళనాడులో మూడో అతి పెద్ద పార్టీ అయిన పీఎంకే మాత్రమే ప్రజా సమస్యలపై పోరాడుతోందని రాందాస్ అన్నారు. తమ పోరాటాల వల్లే జాతీయ రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలు మూత పడ్డాయని చెప్పారు. లాటరీ టెకెట్ల అమ్మకాలపై నిషేధం, ఏకీకృత విద్యా విధానం, మద్యం దుకాణాల పని వేళల తగ్గింపు తదితర ప్రజాప్రయోజనాలన్నీ తమ పోరాటాల వల్లే సాధ్యమయ్యాయని తెలిపారు. 

More Telugu News