Cyber Crime: కొత్త తరహా సైబర్ మోసం... రూ. 7 లక్షలు పోగొట్టిన పాత ఫోన్ నంబర్!

  • అమెరికా వెళుతూ పాత నంబర్ ను నిరుపయోగంగా ఉంచిన యువతి
  • మరో వ్యక్తికి కేటాయింపు
  • యాప్స్ లోడ్ చేసుకోగానే వచ్చేసిన బ్యాంకు ఖాతా, పిన్ తదితరాలు

మరో కొత్త తరహా సైబర్ మోసం జరిగింది. ఓ యువతి వాడిన పాత ఫోన్ నంబర్ ను ఓ సెల్యులార్ సంస్థ మరొకరికి కేటాయించగా, యువతి ఖాతా నుంచి రూ. 7 లక్షలు మాయం అయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, హిమాయత్ నగర్ లో ఉంటున్న ఓ యువతి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. ఆమెకు అమెరికాలో ఉన్నతోద్యోగం రావడంతో అక్కడికి వెళ్లింది.

దీంతో నిరుపయోగంగా మారిన ఆమె మొబైల్ నంబర్ ను వేరే వ్యక్తికి ఇచ్చింది నెట్ వర్క్ సంస్థ. అతను తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని వేసుకుని పలు రకాల యాప్స్ డౌన్ లోడ్ చేసుకోగా, ఆమె బ్యాంకు ఖాతా వివరాల నుంచి పిన్ నంబర్ వరకూ అన్ని వివరాలూ వచ్చేశాయి. వాటిని వాడుకుని రూ. 7 లక్షలు విత్ డ్రా చేసుకున్నాడా వ్యక్తి. ఆమె తండ్రి ఈ విషయాన్ని గుర్తించి, కుమార్తెతో మాట్లాడగా, తానేమీ డబ్బు తీసుకోలేదని, వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతో ఆయన సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించగా, సదరు వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బ్యాంకుకు ఆ మొబైల్ నంబర్ అనుసంధానం అయి ఉండటంతోనే ఇలా జరిగిందని, ఖాతాలకు ఫోన్ నంబర్ల అనుసంధానం పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

More Telugu News