YSRCP: అయ్యో! ‘యాత్ర’ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్‌కే పోతుందా?.. వైసీపీలో అంతర్మథనం

  • ‘యాత్ర’ సినిమాతో వైసీపీకి ఒరిగేది శూన్యం
  • కాంగ్రెస్‌కు కాసింతైనా మేలు
  • ఎటూ తేల్చుకోలేకపోతున్న వైసీపీ నేతలు

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘యాత్ర’ సినిమా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది. ఏపీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ప్రజల్లో వైసీపీ క్రేజ్ పెరుగుతుందని, ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని ఇప్పటి వరకు వైసీపీ ఘనంగా చెప్పుకుంది.

అయితే, ఇప్పుడు మాత్రం ఆలోచనలో పడిపోయింది. దీనికి కారణం... ఇది కాంగ్రెస్ కోణంలో వస్తుండడమే. తన జీవితకాలం మొత్తం కాంగ్రెస్‌లోనే కొనసాగిన రాజశేఖరరెడ్డి, పాదయాత్ర ద్వారా పార్టీని తిరిగి రాష్ట్రంలో గద్దెనెక్కించగలిగారు. ప్రధానంగా పాదయాత్ర చుట్టూనే తిరిగే ఈ సినిమా టీజర్‌ను వైఎస్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ‘తెలుసుకోవాలని ఉంది. కడప దాటి ప్రతి గడపకు వెళ్లాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. ఈ పాదయాత్ర నా పట్టుదలో, మూర్ఖత్వమో చరిత్రనే నిర్ణయించుకోనీ’.... అనే డైలాగు‌లతో ‘యాత్ర’ టీజర్‌ విడుదలైంది.

ఈ సినిమాను వైఎస్ బయోపిక్‌గా చెబుతున్నప్పటికీ ప్రధానంగా పాదయాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇందులో వైఎస్ పాత్రధారి మమ్ముట్టి కాంగ్రెస్ కండువా వేసుకుని కనిపిస్తారు. ఇందులో ఏ రకంగా చూసినా వైఎస్-కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి వైసీపీకి వచ్చే లాభం ఏకోశానా కనిపించడం లేదు. వైసీపీకి ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. ఏపీలో పూర్తిగా కునారిల్లిన కాంగ్రెస్‌కే ఇది మేలుచేసే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

ఏ రకంగా చూసినా ‘యాత్ర’ వల్ల వైసీపీకి ఒరిగేదేమీ లేదని అంటున్నారు. దీంతో ఈ సినిమా విషయంలో తాము ఎలా ‘ప్రమోషన్’ చేసుకోవాలో తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

More Telugu News