Guntur District: పిడుగురాళ్లలో అర్ధరాత్రి ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాల తొలగింపు... మండిపడుతున్న వైసీపీ!

  • ఐలాండ్ సెంటర్ లో ఎన్టీఆర్, వైఎస్ఆర్  విగ్రహాలు 
  • రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్నాయని తొలగింపు
  • తిరిగి అక్కడే ప్రతిష్ఠిస్తామన్న కాసు మహేష్ రెడ్డి

పిడుగురాళ్ల పట్టణం ఐలాండ్ సెంటర్ లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత ఎన్టీఆర్ విగ్రహాలను అర్ధరాత్రి అధికారులు తొలగించారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రహదారిని విస్తరించేందుకు విగ్రహాలు అడ్డుగా ఉన్నాయని ఆరోపించిన అధికారులు, రాజకీయ నాయకులతో సమావేశమై దీనిపై చర్చించారు. అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహదాత ప్రస్తుతం టీడీపీలో లేకపోవడంతో ఆ విగ్రహం తొలగింపునకు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు.

వైఎస్ విగ్రహం తొలగించేందుకు స్థానిక నేతలు నిరాకరించడంతో,  తహసీల్దార్‌ రవి బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ కాసు శివరామిరెడ్డి, పట్టణ సీఐ ఎం హనుమంతరావు తదితరులు దగ్గరుండి రాత్రివేళ, విగ్రహాన్ని తొలగించి ఆర్ అండ్ బీ బంగళాకు తరలించారు. ఇలా దొంగతనంగా విగ్రహాలను తొలగించడమేంటని ప్రశ్నించిన గురజాల వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌ రెడ్డి, తిరిగి అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

గతంలో ట్రాఫిక్ కు ఇబ్బందిలేని విధంగా కలెక్టర్ అనుమతితో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేసిన ఆయన, అధికారుల తీరుపై మండిపడ్డారు. తమకు చెబితే, విగ్రహం తొలగింపునకు సహకరించేవాళ్లమని అన్నారు. విగ్రహాన్ని తొలగించిన వారిని సస్పెండ్ చేయించే వరకూ నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు.

More Telugu News