AAdhar: వందకోట్ల సార్లు ప్రయత్నించినా ఆధార్ హ్యాక్ అసాధ్యం: కేంద్ర మంత్రి

  • ప్రతీ మూడు సెకన్లకు 3 కోట్ల ఆధార్ ఆథెంటికేషన్లు
  • ఆధార్ డేటా పూర్తి సురక్షితం
  • అత్యంత భద్రత మధ్య, గోప్యంగా ఉంది

ప్రతీ మూడు  సెకన్లకు మూడుకోట్ల ఆధార్ ఆథెంటికేషన్లు జరుగుతున్నట్టు కేంద్ర సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఆధార్ బయోమెట్రిక్ డేటాను హ్యాక్ చేయడం అసాధ్యమని పేర్కొన్నారు. వంద కోట్ల సార్లు ప్రయత్నించినా హ్యాక్ చేయలేరని తేల్చి చెప్పారు. డేటా స్టోరేజీ సిస్టం పూర్తి సురక్షితమని, భద్రంగా ఉందని పేర్కొన్నారు. గోవాలో నిర్వహిస్తున్న ఐటీ వేడుకల్లో చివరి రోజైన ఆదివారం మంత్రి పాల్గొని మాట్లాడారు.

‘‘నా ఫింగర్ ప్రింట్‌లు, ఐరిస్ స్కాన్‌లు పూర్తి సురక్షితంగా, భద్రంగా ఉన్నాయి. వాటిని ఛేదించడం అసాధ్యం. వందకోట్ల సార్లు ప్రయత్నించినా ఆ పని చేయలేరు’’ అని మంత్రి వివరించారు. ‘‘మీకు తెలుసా? ప్రతీ మూడు సెకన్లకు ఎన్ని ఆధార్‌లు ప్రామాణీకరించబడుతున్నాయో? మూడు కోట్లు. మీకు తెలుసా? ఇప్పటి వరకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమయ్యాయో? 80 కోట్లు’’ అని పేర్కొన్నారు.

ఓ అపరిచిత వ్యక్తితో తానైనా ఆధార్‌కు సంబంధించిన వివరాలను పంచుకుంటే శిక్ష అనుభవించకతప్పదన్నారు. అయితే, ఒక్క దేశభద్రతకు సంబంధించిన విషయాలలో మినహాయింపు ఉంటుందన్నారు. దేశానికి సంబంధించి డిజిటల్ ప్రొఫైల్ గురించి రవిశంకర్ ప్రసాద్ వివరిస్తూ..130 కోట్ల మంది ప్రజల్లో 121 కోట్ల మంది మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని, 4.50 కోట్ల స్మార్ట్‌ఫోన్లు, 50 కోట్లకు పైగా ఇంటర్నెట్ కనెక్షన్లు, 122 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నట్టు మంత్రి వివరించారు.

More Telugu News