Bangaluru: వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యకు చిత్రహింసలు.. కర్నాటక ఐపీఎస్ అధికారిపై దర్యాప్తునకు ఆదేశాలు!

  • భర్త వివాహేతర సంబంధంపై డీజీపీకి ఫిర్యాదు
  • కేసు పెట్టినా పట్టించుకోని పోలీసులపై కోర్టుకు
  • కోర్టు జోక్యంతో ఎస్పీపై దర్యాప్తు

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న ఐపీఎస్ అధికారిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. హోంశాఖ ఆదేశంతో కేసు నమోదు చేసుకున్న బెంగళూరు అర్బన్ జిల్లాలోని కోరమంగళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. డీజీపీని కలిసిన ఎస్పీ డాక్టర్‌ భీమాశంకర్‌ గుళేద భార్య.. భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను అందజేస్తూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన డీజీపీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కడ ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తతోపాటు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు.

దీనిపై స్పందించిన ఎస్పీ తన భార్య మానసిక వ్యాధితో బాధపడుతోందని పేర్కొన్నారు. ఆమెకు కొందరు తనపై లేనిపోనివి నూరిపోశారని ఆరోపించారు. వారి ప్రోద్బలంతోనే ఆమె కేసు పెట్టారని పేర్కొన్నారు. బాధితురాలి పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఎస్పీపై దర్యాప్తు చేయాలని కోరమంగళ పోలీసులను ఆదేశించింది.

More Telugu News