Kathi Mahesh: కత్తి మహేశ్, పరిపూర్ణానందలపై బహిష్కరణను సమర్థించుకున్న కేసీఆర్

  • శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటాం
  • అందుకే వారిని నగరం నుంచి బహిష్కరించాం
  • గవర్నర్‌తో భేటీలో కేసీఆర్

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను, ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు నగరం నుంచి బహిష్కరించిన సంగతి విదితమే. వీరిద్దరి బహిష్కరణను ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించుకున్నారు. ఆదివారం గవర్నర్ నరసంహన్‌తో భేటీ అయిన కేసీఆర్ వారిద్దరిపై వేటుకు గల కారణాలను వివరించారు. శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వారిపై వేటు వేయడానికి అదే కారణమన్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ బీజేపీ నేతలు శనివారం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం నరసింహన్‌తో సీఎం భేటీ అయ్యారు. పలు విషయాలను వివరించారు. సంచార జాతులను బీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదన ఉందని తెలిపారు. అలాగే, కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌‌ల శాసనసభ్యత్వాల రద్దు, హైకోర్టులో ధిక్కార పిటిషన్, పార్లమెంటు సమావేశాలు, ముందస్తు ఎన్నికలు వంటి విషయాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News