East Godavari District: నేటి వైఎస్ జగన్ పాదయాత్ర రేపటికి వాయిదా!

  • తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షం
  • పాదయాత్రను రద్దు చేసుకున్న జగన్
  • రేపు కొనసాగనున్న నేటి షెడ్యూల్

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సమీపంలోని గొల్లల మామిడాల శివార్లలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, నేటి తన యాత్రకు విరామం ఇచ్చారు. ప్రజా సంకల్ప పాదయాత్ర 213వ రోజు ఈ ఉదయం ప్రారంభం కావాల్సివుండగా, ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రను ఒకరోజు వాయిదా వేస్తున్నామని, నేటి షెడ్యూల్ రేపు కొనసాగుతుందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, నిన్న గొల్లల మామిడాడలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్, అనపర్తి ఎమ్మెల్యే ఇక్కడి ప్రజల నుంచి ప్రత్యేక పన్నులను వసూలు చేస్తూ, దానిలో చిన్నబ్బాయికి వాటా ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రమంతా ఒక రకమైన జీఎస్టీ ఉంటే, దానికి అదనంగా ఇక్కడ టీడీపీ పన్నుందని వ్యాఖ్యానించారు. ఇక్కడి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి, వాటిని రవాణా చేయకుండా చేసినట్టు చూపిస్తారని, పై స్థాయుల వరకూ వాటాలందుతున్నాయని ఆరోపించారు. భూమి లే అవుట్ కు రూ. 2 లక్షలు, మద్యం దుకాణం నుంచి రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఇలాంటి అవినీతిని నియంత్రిస్తానని హామీ ఇచ్చారు.

More Telugu News