Uddhav Thackeray: బీజేపీపై మళ్లీ విమర్శలు ఎక్కుపెట్టిన ఉద్ధవ్ థాకరే!

  • నోట్ల రద్దు నిర్ణయానికి క్షణం ఆలస్యం చేయలేదు
  • రామ మందిరం విషయంలో మాట్లాడడం లేదు
  • 2050కైనా పూర్తవుతుందా?

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మరోమారు బీజేపీని రెచ్చగొట్టారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని క్షణాల్లో తీసుకున్నారని, మరి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం సంగతిని ఇంకా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించారు. ‘‘నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణం తీసుకున్నారు. కానీ, రామ మందిర నిర్మాణానికి సంబంధించిన పని మాత్రం ఇంకా మొదలే కాలేదు. వాళ్లేమో ఎన్నికలకు ముందే ఆలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. ఇంతకీ ఏ ఎన్నికలు? 2019 ఎన్నికలా? లేక 2050వా?’’ అని ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికల ముందస్తు సన్నాహాల కోసం పూణె వచ్చిన థాకరే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న ‘యూనిఫామ్ సివిల్ కోడ్’ విషయంలోనూ ఆ పార్టీ అలాగే వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఇంత ముఖ్యమైన అంశంపై ఇప్పటి వరకు అసలు చర్చే లేదని విమర్శించారు. అసలా విషయాన్నే వారు మర్చిపోయారని అన్నారు. బీజేపీకి కావాల్సినంత మెజారిటీ ఉందని, కాబట్టి దీనిని అమలు చేసి తీరాల్సిందేనన్నారు.

More Telugu News