Bnagaluru: ఎట్టకేలకు చిక్కిన విదేశీ దొంగలు.. టూరిస్టు వీసాపై వచ్చి కొలంబియా మహిళ చోరీలు

  • టూరిస్ట్ వీసాపై వచ్చి మహిళ దొంగతనాలు
  • మరికొందరితో కలిసి ముఠా
  • అరెస్ట్ చేసిన పోలీసులు

టూరిజం వీసాపై దేశంలో అడుగుపెట్టిన ఓ విదేశీ ముఠా బెంగళూరు వాసులను నిద్రకు దూరం చేసింది. వరుస చోరీలతో పోలీసులకు సవాలు విసిరింది. హైటెక్ పద్ధతుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి వచ్చిన మహిళ, తన దేశానికే చెందిన మరి కొందరితో కలసి ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

బెంగళూరులోని ఖరీదైన ప్రాంతాలను ఎంచుకున్న ముఠా సభ్యులు.. తొలుత కారులో అక్కడికి చేరుకుంటారు. తర్వాత ఎంచుకున్న ఇంటికి వెళ్లి మహిళ కాలింగ్ బెల్ నొక్కుతుంది. ఎవరైనా వస్తే ఏదో చిరునామా అడిగి తప్పించుకుంటుంది. ఎవరూ రాకుంటే ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని, కారులో వున్న తన ముఠా సభ్యులకు ఫోన్ లో చెబుతుంది. దాంతో వారొచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి దోచుకుంటారు. గత నెల 16న హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో నివసించే మాజీ సీఎస్ కౌశిక్‌ ముఖర్జీ ఇంట్లోకి చొరబడిన ముఠా రూ.25 లక్షల విలువైన సొత్తు దోచుకెళ్లింది. పోలీసులకు ఘటనా స్థలంలో లభించిన స్క్రూ డ్రైవర్ విదేశాల్లో మాత్రమే దొరికేది కావడంతో, దొంగతనంలో విదేశీయుల హస్తం ఉందని అనుమానించారు.

జూన్ 22న జయనగర్‌లో ఓ దుస్తుల వ్యాపారి ఇంట్లో చోరీకి యత్నించారు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా బన్నేరుఘట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌పై శుక్రవారం పోలీసులు దాడి చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు స్పానిష్ తప్ప మరో భాష రాదని పోలీసులు తెలిపారు. నిందితులకు కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించింది.

More Telugu News