సెల్‌ టవర్‌ ఎక్కిన అమ్మాయి కేసు.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం!

14-07-2018 Sat 21:01
  • యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో ఘటన
  • నిన్న ఆందోళన చేసిన యువతి
  • పీఎస్‌లో ఆమె ప్రియుడితో సంప్రదింపులు జరిపిన పోలీసులు
  • ఈరోజు ఇంటికెళ్లి పురుగుల మందు తాగిన ప్రియుడు
తన ప్రియుడు మోసం చేశాడంటూ నిన్న యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో వెంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న సెల్ టవర్‌పైకి ఎక్కిన జ్యోతి అనే యువతి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించిన విషయం తెలిసిందే. తనను వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ అనే యువకుడు ఇన్నాళ్లు ప్రేమించి, పెళ్లి పేరు ఎత్తేసరికి తనను కలవద్దంటున్నాడని ఆమె తెలిపింది.

ఆమెకు నచ్చజెప్పిన పోలీసులు సెల్‌టవర్‌ నుంచి కిందకు దింపి, ఆమె ప్రియుడు భాస్కర్‌ను వలిగొండ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి పెళ్లి చేసుకోవాలని చెప్పారు. ఆమెను పెళ్లి చేసుకోనని చెప్పి ఇంటికి వెళ్లిన భాస్కర్‌.. ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.