mini satellite: 15 వేలకే శాటిలైట్ తయారు చేసిన భారత విద్యార్థులు.. వచ్చే నెల ప్రయోగించనున్న నాసా!

  • ప్రపంచంలోనే అతి చిన్న శాటిలైట్ ను తయారు చేసిన తమిళనాడు విద్యార్థులు
  • వాతావరణానికి సంబంధించిన సమాచార సేకరణ 
  • బెలూన్ ద్వారా ప్రయోగించనున్న నాసా

ప్రంపంచంలోనే అతి చిన్న ప్రయోగాత్మక శాటిలైట్ ను తమిళనాడు విద్యార్థులు రూపొందించారు. దీని తయారీకి అయిన ఖర్చు కేవలం రూ. 15 వేలు మాత్రమే. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే అతి చిన్న, చవకైన శాటిలైట్ గా ఇది రికార్డులకెక్కింది. చెన్నై సమీపంలోని కేలంబాక్కంలో ఉన్న హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు దీన్ని తయారు చేశారు. ఈ శాటిలైట్ కు 'జైహింద్-1ఎస్' అని పేరు పెట్టారు. వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహం సేకరిస్తుంది.

నాలుగు సెంటీమీటర్ల క్యూబ్ ఆకారంలో ఈ శాటిలైట్ ను తయారు చేశారు. దీని బరువు 33.39 గ్రాములు. మీడియం సైజు కోడి గుడ్డు కన్నా దీని బరువు తక్కువగా ఉండటం గమనార్హం. ఔటర్ కేసింగ్ ను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేయడం ద్వారా ఇంత తక్కువ బరువుతో తయారు చేయగలిగారు.  

ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం దీన్ని వచ్చే నెల నాసా కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఒక బెలూన్ ద్వారా దీన్ని ఆకాశంలోకి ప్రవేశపెట్టనున్నారు. నిర్దేశించిన ఎత్తు వరకు వెళ్లిన తర్వాత బెలూన్ నుంచి విడిపోయి, ఆ తర్వాత ఇది కిందకు పడిపోతుంది. ఒక సెకనుకు 20 రకాల వాతావరణ స్థితిగతులను నాలుగు విధాలుగా ఈ శాటిలైట్ కొలుస్తుంది. ఈ డేటా మొత్తం శాటిలైట్ లో ఉన్న ఎస్డీ కార్డులో స్టోర్ అవుతుంది.

శాటిలైట్ లో ఉన్న సెన్సార్ మాడ్యూళ్లు... శాచురేటెడ్ వెపర్ ప్రెజర్, యాక్చువల్ వెపర్ ప్రెజర్, ల్యాప్స్ రేట్ లాంటి వాటిని కూడా కొలుస్తాయి. వాతావరణ స్థితిగతులపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. 40 అడుగుల ఎత్తులో ఈ శాటిలైట్ ను పరీక్షించిన అనంతరం... గత వారమే ఈ శాటిలైట్ ను నాసాకు పంపారు.

More Telugu News