nawaz sharif: జైల్లో నవాజ్ షరీఫ్, మర్యంలకు బీ క్లాస్ వసతులు!

  • రావల్పిండిలోని అడియాలా జైల్లో షరీఫ్, మర్యం
  • ఇస్లామాబాద్ మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు
  • సోషల్ స్టేటస్ ప్రకారం బీ క్లాస్ వసతుల కల్పన

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యంలకు రావల్పిండిలోని అడియాలా జైల్లో బీ క్లాస్ వసతులు కల్పించారు. సమాజంలో వీరికి ఉన్న స్థాయి మేరకు ఈ వసతులను కల్పించినట్టు అధికారులు తెలిపారు. వీరిద్దరూ ఎంతో సెక్యూరిటీ ఉన్న అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వాస్తవానికి ఇస్లామాబాద్ లోని సిహాలా పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్న రెస్ట్ హౌస్ ను వీరిద్దరికీ సబ్ జైలుగా ఉపయోగించాలని పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు వీరిద్దరూ అక్కడే ఉంటారని గెజిట్ నోటీసులో పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి వీరిద్దరినీ అడియాలా జైల్లోనే ఉంచాలని అధికారులు భావించినట్టు జియో న్యూస్ తెలిపింది.

అడియాలా జైల్లో ఇస్లామాబాద్ మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో షరీఫ్, మర్యంలకు ఓ వైద్య బృందం వైద్య పరీక్షలను నిర్వహించింది. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని పరీక్షలో తేలిందని అధికారులు తెలిపారు. పాక్ చట్టాల ప్రకారం ఏ, బీ క్లాస్ ఖైదీలకు ప్రత్యేక వసతులు ఉంటాయి. ఒక మంచం, పరుపు, కుర్చీ, శానిటరీ ఐటెమ్స్ తో పాటు వారు ఉపయోగించాలనుకునే ఇతర వస్తువులను కూడా అనుమతిస్తారు. కష్టమైన పనులను వారికి అప్పజెప్పరు. తోటి ఖైదీలకు ఏదైనా బోధించే కార్యక్రమాల వంటి సులభమైన పనులను మాత్రమే అప్పగిస్తారు. ప్రత్యేక వసతులకు అయ్యే ఖర్చును ఆయా ఖైదీలే భరించాల్సి ఉంటుంది.

More Telugu News