Thailand: ప్రాణాలు దక్కించుకునేందుకు అలా చేయక తప్పలేదు: థాయ్ చిన్నారి

  • బురదను చేత్తో ఎత్తిపోశాం
  • వర్షపు నీటిని ఒక్కో చుక్కా తాగాం
  • గుహ గురించి తెలిసి ఉండడం కలిసొచ్చింది

గుహ సందర్శనకు వెళ్లి అందులో చిక్కుకుపోయిన థాయ్‌లాండ్ జూనియర్ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు 18 రోజుల తర్వాత గుహ నుంచి బయటపడ్డారు. 12 మంది చిన్నారులు, వారి కోచ్‌లను థాయ్ నేవీ సీల్స్ డైవర్స్ రక్షించి వెలుపలికి తీసుకొచ్చారు. గుహలో చిక్కుకుపోయిన వారిని 9 రోజుల తర్వాత గుర్తించిన థాయ్ ప్రభుత్వం వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రపంచం సాయాన్ని కూడా అర్థించింది. వారు క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రార్థనలు చేశారు. ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు.

గుహ నుంచి బయటపడిన చిన్నారుల్లో డ్వాంగ్‌పెచ్ ప్రొంథెప్ (13) అనే బాలుడు తొలిసారి మాట్లాడుతూ గుహలో తాము ఎలా ఉన్నదీ వివరించాడు. బురదలో చిక్కుకుపోయిన తాము మరింత ఎత్తైన ప్రదేశానికి చేరుకునేందుకు చేతులతో బురదను ఎత్తిపోసినట్టు చెప్పాడు. దాహంతో అల్లాడిపోతుంటే గుహ పై నుంచి పడుతున్న వర్షపు నీటిని ఒక్కో చుక్కను నోటితో పట్టుకున్నట్టు చెప్పాడు. గుహలో ఎక్కడ ఏముందో తమకు తెలుసని, గతంలో పలుమార్లు సందర్శించడం తమకు కలిసి వచ్చిందని చెప్పాడు. రెస్క్యూ సిబ్బంది వచ్చే వరకు తాము కూర్చున్న ప్రదేశం చాలా చిన్నదని, అందరూ కూర్చోవడానికి కుదిరేది కాదని వివరించాడు. దీంతో కొందరు కూర్చున్నప్పుడు మరికొందరం నిలబడేవారమని చెప్పాడు. 

More Telugu News