kala vankatrao: పవన, సోలార్ విద్యుత్‌ ఉత్పత్తుల్లో మనమే ఫస్ట్: ఏపీ మంత్రి కళా వెంకట్రావు

  • మొత్తం విద్యుత్‌ 149 మిలియన్ యూనిట్లు
  • పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 74.58 మిలియన్ యూనిట్లు
  • వాటిలో పవన విద్యుత్ వాటా 66.41 మిలియన్ యూనిట్లు
  • సౌర విద్యుత్ ద్వారా 8.17 మిలియన్ యూనిట్లు

పవన, సోలార్ విద్యుత్‌ ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. మొత్తం విద్యుత్ గ్రిడ్ డిమాండ్ లో నిన్న (11-07-2018) మన పవన, సోలార్ విద్యుత్‌ ఉత్పత్తి వాటా 50 శాతంగా నిలిచిందని అన్నారు. ఈరోజు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని తన కార్యాలయంలో రోజువారీ విద్యుత్ వినియోగ నివేదికపై జరిపిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సంప్రదాయేతర ఇంధన వనరులైన పవన, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనివల్ల ఆ రెండు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. 2014లో తమ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉండేదన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన విద్యుత్ సంస్కరణల కారణంగా నేడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 149 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందన్నారు. ఇందుకనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 149 మిలియన్ యూనిట్లలో పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 74.58 మిలియన్ యూనిట్లు ఉన్నాయన్నారు.

వాటిలో పవన విద్యుత్ వాటా 66.41 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్ ద్వారా 8.17 మిలియన్ యూనిట్లు ఉత్పత్తవుతోందని కళా వెంకట్రావు అన్నారు. మొత్తం ఉత్పత్తిలో 50 శాతం వాటా పవన, సోలార్ విద్యుత్తేనని మంత్రి కళా వెంకటరావు తెలిపారు. భవిష్యత్తులో వాటి వాటా శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

2017-18 సంవత్సరంలో పవన, సోలార్ విద్యుత్ వాటా 18 శాతం ఉండగా, 2018-19 సంవత్సరంలో 25 శాతం పైబడి వస్తుందని ఆశిస్తున్నామని కళా వెంకట్రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖలో వాణిజ్యపరమైన నష్టాలను 10.4 శాతానికి తగ్గించగలిగామని మంత్రి కళా వెంకటరావు తెలిపారు.  

More Telugu News