laxma reddy: ఒకే రోజు 33 మందికి ప్ర‌స‌వాలు.. సిద్దిపేట వైద్య సిబ్బందికి మంత్రి ల‌క్ష్మారెడ్డి అభినంద‌న‌లు

  • రూ.25 కోట్ల‌తో నిర్మించిన వైద్య‌శాల
  • కేసీఆర్‌ కిట్ల ప‌థ‌కానికి భారీ స్పందన
  • ల‌క్ష‌లు వెచ్చించినా అంద‌ని వైద్యం ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లో ఉచితం 

సిద్దిపేట ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుపత్రికి అనుబంధంగా ప‌ని చేస్తోన్న మెడిక‌ల్ కాలేజీ ఎంసీహెచ్ విభాగంలో ఒకే రోజు 33 మందికి ప్ర‌స‌వాలు చేసిన  వైద్యులు, సిబ్బందికి తెలంగాణ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. రూ.25 కోట్ల‌తో నిర్మించిన వైద్య‌శాలలో సిబ్బంది మంచి ఫ‌లితాలు సాధించ‌డం పట్ల హర్షం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ ఆవిర్భావం త‌రువాత కేసీఆర్ కిట్ల ప‌థ‌కం ప్రారంభించాక రాష్ట్రంలో జ‌రుగుతోన్న ప్ర‌స‌వాల మొత్తంలో స‌గానికిపైగా స‌ర్కార్ ద‌వాఖానాల్లోనే జ‌రుగుతున్నాయ‌న్నారు. కేసీఆర్‌ కిట్ల ప‌థ‌కానికి తోడుగా, ఆయా ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది బాగా ప‌నిచేస్తున్నార‌న్నారు. తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు చొర‌వ‌, ప్రోత్సాహంతో వైద్యులు, సిబ్బంది అత్య‌ద్భుతంగా ప‌ని చేస్తున్నార‌న‌డానికి సిద్దిపేట ఆసుపత్రిలో 24 గంట‌ల్లో జరిపిన 33 మంది ప్ర‌స‌వాలే ఉదాహ‌ర‌ణ అన్నారు. సిద్దిపేట ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది రాష్ట్ర వైద్య శాఖ‌కే ఆద‌ర్శంగా నిలిచారన్నారు. వీరిని ఆద‌ర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగ‌తా సిబ్బంది, వైద్యులు బాగా ప‌ని చేయాల‌ని ల‌క్ష్మారెడ్డి సూచించారు.

డీఎంఅండ్‌హెచ్‌వోని అభినందించిన మంత్రి..
ఆర్మూరు ప్ర‌భుత్వ ద‌వాఖానాలో త‌న బిడ్డ‌ను ప్ర‌స‌వింప చేయ‌డం ద్వారా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం వైద్యాధికారి ద‌యానంద్ స‌ర్కారీ ద‌వాఖానాల మీద ప్ర‌జ‌ల‌కు మరింత న‌మ్మ‌కం పెంచార‌ని ఆయ‌నను లక్ష్మారెడ్డి అభినందించారు. స‌ర్కార్ ద‌వాఖానాల్లో అనేక అత్యాధునిక స‌దుపాయాలు క‌ల్పించామ‌ని, ప‌రికరాలు అందుబాటులో ఉన్నాయ‌ని, అప్పుడే పుట్టిన శిశువుల సంర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌ని అన్నారు. దీంతో ల‌క్ష‌లు వెచ్చించినా అంద‌ని వైద్యం ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లో ఉచితంగా అందుతోందని మంత్రి తెలిపారు.

More Telugu News