Andhra Pradesh: రాజ‌మండ్రి, గుంటూరులలో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంప్స్

  • 2018 హజ్ యాత్రకు వెళ్ళే వారి కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు
  • ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తకుండా యాత్రికులకు వ్యాక్సిన్స్
  • ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎ. షరీఫ్ వెల్లడి

హజ్ యాత్రకు వెళ్ళే వారు ఎలాంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ క్యాంప్ ల‌ను స్టేట్ హ‌జ్ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, ఒంగోలు, క‌ర్నూల్‌, ఆత్మ‌కూర్‌, నంద్యాల‌, విశాఖ‌ప‌ట్నంల‌లో ప్ర‌త్యేక హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి హ‌జ్ యాత్రికుల‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. తాజాగా, రాజ‌మండ్రి, గుంటూరు ప‌ట్ట‌ణాల్లో ఈరోజు వ్యాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి యాత్రికుల‌కు టీకాలు వేశారు.

గుంటూరు హజ్ వ్యాక్సినేషన్ క్యాంప్ ను ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎ. షరీఫ్ లాంఛ‌నంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాకు చెందిన హజ్ యాత్రికులు ఈ క్యాంప్ లో వ్యాక్సిన్ తీసుకున్నారు. సౌదీ ప్రభుత్వ సూచన మేరకు భారత ప్రభుత్వం ప్రతి హజ్ యాత్రికుడికి ఓరల్ పోలియో, మెనింజైటిస్, ఇన్ ఫ్లు యెన్జా వ్యాక్సినేషన్స్ ఇస్తుందని షరీఫ్ చెప్పారు. సౌదీలోని మక్కాకు వెళ్ళినప్పుడు హాజీలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పని సరి.

హజ్ యాత్రికుల ప్రయాణానికి సంబంధించి విమానాల షెడ్యూల్ వచ్చిన తరువాత తమకు కేటాయించిన తేదీకి 24 గంటల ముందు హైదరాబాద్ లోని నాంపల్లి హజ్ హౌస్ కు చేరుకోవాలని సూచించారు. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రతి హజ్ యాత్రికుడు పేపర్ వీసా మీద ఉన్న వివరాలు, పాస్ పోర్ట్ లో ఉన్న వివరాలతో సరిపోల్చుకొని చూసుకోవాలని హజ్ యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి హజ్ యాత్రికుడు వ్యాక్సిన్ తీసుకోవడం, శిక్షణా తరగతుల్లో సూచించిన సలహాల మేరకు హజ్ విధి విధానాల్ని పాటించడం, తమకు తెలియని విషయాల్ని తెలుసుకోవాలని ఈ స‌మావేశంలో ప్ర‌సంగించిన వ‌క్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.  

More Telugu News