Tamilnadu: ఆడవాళ్లు సిగరెట్లు తాగడమేంటన్న కమలహాసన్... తప్పేంటంటూ రెచ్చిపోయిన హీరోయిన్ గాయత్రీ రఘురాం!

  • 'బిగ్‌ బాస్‌' కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమలహాసన్
  • హౌస్ లో ఆడవాళ్లు సిగరెట్ తాగడాన్ని తప్పుబట్టిన కమల్
  • ఒత్తిడి, మనోవేదన ఎవరికైనా ఒకటేనన్న గాయత్రి

'మక్కళ్‌ నీది మయ్యం' పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత కూడా తమిళ 'బిగ్‌ బాస్‌' కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమలహాసన్, ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నటి గాయత్రీ రఘురాం మండిపడింది. బిగ్ బాస్ హౌస్ లోని లేడీ సెలబ్రిటీలు సిగరెట్లు కాలుస్తుండటం, పురుషులతో కలసి ఒకే మంచంపై నిద్రించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి వాటిని కమల్ ఖండించిన ఎపిసోడ్ ఇటీవల ప్రసారమైంది.

ఆడవారు సిగరెట్లు తాగడమేంటని, మగవారు చేసే పనులను మహిళలు చేయరాదని, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఈ సందర్భంగా కమల్, మహిళా కంటెస్టెంట్ లకు క్లాస్ పీకారు. దీనిపై తన సోషల్ మీడియా ఖాతాల్లో స్పందించిన గాయత్రి, మగవారి కంటే గొప్పవాళ్లమని చెప్పుకునేందుకు ఆడవాళ్లు సిగరెట్లు కాల్చడం లేదని చెప్పింది. ఆడవాళ్లకు కూడా మానసిక ఒత్తిడి, మనోవేదన ఉంటాయని, ఆ కారణంగానే సిగరెట్లు కాలుస్తున్నారని అంది. ధూమపానం అలవాటు ఆడ, మగ ఇద్దరికీ చెడేనని, మగవారు గొప్పవారని, స్త్రీలు వారిని కాపీ కొడుతున్నారన్న ధోరణిలో కమల్ మాట్లాడడం తప్పని విమర్శించింది. కాగా, గత సంవత్సరం బిగ్ బాస్ లో గాయత్రి కంటెస్టెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News