USA: రూ. 81 వేల కోట్లతో యూఎస్ చేపట్టిన సీక్రెట్ ప్రాజెక్టు హ్యాక్.. రూ. 13 వేలకు విక్రయం!

  • సర్వర్లలోకి జొరబడి హ్యాక్ చేసిన హ్యాకర్
  • గుర్తించిన రికార్డెడ్ ఫ్యూచర్ ఇన్ స్టిక్ గ్రూప్
  • విచారణ ప్రారంభించిన భద్రతా సంస్థలు

భారీ ఎత్తున నిధులను కేటాయించి అమెరికా అభివృద్ధి చేసిన ఓ సీక్రెట్ ప్రాజెక్టు హ్యాక్ నకు గురైంది. ఈనెల ఆరంభంలో రికార్డెడ్ ఫ్యూచర్ ఇన్ స్టిక్ గ్రూప్ ఈ విషయాన్ని కనుగొంది. దాదాపు రూ. 81 వేల కోట్లతో (11.8 బిలియన్ డాలర్లతో) అత్యాధునిక ది ఏక్యూ-9 రీపర్ డ్రోన్లను అమెరికా అభివృద్ధి చేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును, డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేసిన అమెరికా, క్రీచ్ ఎయిర్ బేస్ లో దాన్ని దాచింది. ఇందులోని నెట్ గేర్ రూటర్ లోకి చొరబడిన హ్యాకర్లు ప్రధాన కంప్యూటర్ నుంచి డ్రోన్ టెక్నాలజీని అపహరించారు. రిమోట్ యాక్సెస్ విధానంలో అత్యంత కీలకమైన ఈ సమాచారం మొత్తాన్ని సేకరించిన హ్యాకర్, దాన్ని ఆన్ లైన్ లో 200 డాలర్లకు (సుమారు రూ. 13 వేలు) అమ్మకానికి పెట్టాడు. 150 డాలర్లకే ఇస్తానని కూడా చెప్పాడు.

తన వద్ద డ్రోన్ సాంకేతికత, ఎయిర్ పోర్టు కీలక సమాచారం, వాటిల్లోని లోపాలు, నిర్వహణా బుక్, మరమ్మతుల కోసం ఎవరు పని చేస్తున్నారు?, న్యూ టెక్నాలజీ ఎయిర్ క్రాఫ్ట్ లు ఎలావుంటాయి? తదితర వివరాలు ఉన్నాయని నమ్మకాన్ని కలిగించేందుకు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా జతచేశాడా హ్యాకర్. ఇక యూఎస్ ఫైటర్ ట్యాంక్ సిబ్బంది అనుసరించే వ్యూహాలు కూడా హ్యాకింగ్ కు గురైనట్టు తెలుస్తోంది.

ఈ హ్యాకింగ్ విషయాన్ని గుర్తించిన రికార్డెడ్‌ ఫ్యూచర్‌ ఇన్‌స్టిక్‌ గ్రూప్‌, అతన్ని సంప్రదించింది. తాను కేవలం ఆనందం, మజా కోసమే హ్యాక్ చేశానని హ్యాకర్ పేర్కొనడం గమనార్హం. తనకు విమానాలు, నిఘా కెమెరాల్లోని దృశ్యాలను చూడటం ఇష్టమని చెప్పిన అతను, ఎంక్యూ-1 డ్రోన్ మెక్సికోపై వెళుతుంటే, అది రికార్డు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను లైవ్ లో చూసినట్టు చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారంపై యూఎస్ భద్రతా సంస్థలు దర్యాఫ్తును ప్రారంభించాయి. కాగా, ఇప్పటివరకూ యూఎస్ తయారు చేసిన డ్రోన్లలో ఇదే అత్యంత అధునాతనమైనదని తెలుస్తోంది. రిమోట్ సాయంతో వెళ్లి, స్వతంత్రంగా దాడి చేసే సత్తా ఉన్నవి. వీటిని పెంటగాన్, నాసాలతో పాటు సీఐఏ తదితర సంస్థలూ వినియోగిస్తున్నాయి.

More Telugu News