'భద్రాచలం - విజయవాడ' బస్సులో యువతి ఆత్మహత్య!

11-07-2018 Wed 08:40
  • పురుగుల మందు తాగిన యువతి
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి
  • విచారణ ప్రారంభించిన పోలీసులు
ఇటీవలే పెళ్లి చూపులు జరిగాయి. త్వరలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఏం జరిగిందో ఏమో... భద్రాచలం నుంచి విజయవాడకు వెళుతున్న బస్సు ఎక్కిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా విజయవాడకు చెందిన లావణ్యగా పోలీసులు గుర్తించారు.

భద్రాచలంలో ఆమె బస్సు ఎక్కగా, వీఎం బంజరు వద్దకు రాగానే, ఆమె నోటి నుంచి నురగ వస్తుండటంతో ప్రయాణికులు డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. బస్సును ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లగా, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. లావణ్య తన చేతిపై 'మిస్ యూ డాడీ' అని రాసుకుని ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. లావణ్య తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.