సినిమా షూటింగ్ సెట్లో హీరో జానీ డెప్ వీరంగం!

10-07-2018 Tue 10:02
  • 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
  • షూటింగ్ లో మేనేజర్ పై దాడి చేసిన జానీ డెప్
  • దావా వేసిన మేనేజర్ గ్రెగ్ బ్రూక్స్
'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో జానీ డెప్, ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. 'సిటీ లైట్స్' చిత్రం షూటింగ్ లాస్ ఏంజిల్స్ లోని ఓ హోటల్ లో జరుగుతూ ఉండగా, తనపై జానీ డెప్ దాడి చేశాడని లొకేషన్ మేనేజర్ గ్రెగ్ బ్రూక్స్ దావా వేశాడు. తనను అసభ్యంగా దూషించాడని, కొట్టాడని ఆయన ఆరోపించాడు. షూటింగ్ నిమిత్తం అనుమతించిన సమయం ముగియడంతో ఆ విషయాన్ని జానీకి చెప్పి, త్వరగా షాట్ ను ముగించాలని కోరడంతో, ఆగ్రహంతో దాడికి దిగాడని అన్నాడు.

 ఈ ఘటన తరువాత ఎలాంటి ఫిర్యాదూ వద్దని దర్శక, నిర్మాతలు చెప్పారని, తాను వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేయడంతో ప్రాజెక్టు నుంచి తనను తొలగించారని ఆరోపించాడు. జానీ డెప్ షూటింగ్ కు వచ్చేటప్పుడు డ్రగ్స్ తీసుకుని వస్తాడంటూ సంచలన ఆరోపణలు కూడా చేశాడు. ఈ విషయమై జానీ ఇంకా స్పందించలేదు. కాగా, డిటెక్టివ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న 'సిటీ లైట్స్‌' చిత్రం ఈ సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమైంది.