India: ఇండియాపై పాకిస్థాన్ నిఘా నేత్రాలు... తనవంతు సహకారాన్ని అందించిన చైనా!

  • రెండు శాటిలైట్లను ప్రయోగించిన చైనా
  • ఇండియాపై అనుక్షణం నిఘా పెట్టనున్న పాక్ శాటిలైట్
  • పాక్ టెస్-1ఏ, ప్రెస్-1లు అంతరిక్షంలోకి

ఇండియాపై అనునిత్యం నిఘా పెట్టాలన్న దుర్బుద్ధితో పాకిస్థాన్ కోసం స్పై శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు చైనా తనవంతు సహకారాన్ని అందించింది. 2011 ఆగస్టులో పాక్ శాట్-1ఆర్ అనే కమ్యూనికేషన్ శాటిలైట్ ను ప్రయోగించడం ద్వారా పాకిస్థాన్ కు అంతరిక్ష సహకారాన్ని అందించడం ప్రారంభించిన చైనా, తాజాగా, మరో రెండు శాటిలైట్లను ప్రయోగించింది. వీటిని తీసుకు వెళుతున్న రాకెట్లను నార్త్ వెస్ట్ చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి నేటి ఉదయం ప్రయోగించారు.

వీటిల్లో ఒకటి చైనా తయారు చేసిన ప్రెస్-1 కాగా, రెండోది పాక్ స్వయంగా తయారు చేసుకున్న పాక్ టెస్-1ఏ. వీటిల్లో ప్రెస్-1 శాటిలైట్ అత్యాధునికమైంది. పగలైనా, రాత్రి అయినా, మేఘాలు ఉన్నా, దీని నిఘా నేత్రాలు అలుపెరగకుండా పనిచేస్తుంటాయి. వీటి సాయంతో భూమిపై ఉన్న వనరుల సర్వే, ప్రకృతి విపత్తుల గురించిన ముందస్తు సమాచారం, అగ్రికల్చర్ రీసెర్చ్, పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్న వైనం, భూమిపై జరిగే భారీ నిర్మాణాలను చూస్తుండవచ్చు.

కాగా, స్పేస్ టెక్నాలజీలో ఇండియాతో పోలిస్తే పాకిస్థాన్ ఎంతో వెనుకంజలో ఉంది. ఇప్పటికే 43 శాటిలైట్లను భారత్ అంతరిక్షంలో నిలిపివుంచింది. వీటిల్లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్లు ఉన్నాయి. ఈ శాటిలైట్లు అందించిన సమాచారంతోనే 2016లో పాకిస్థాన్ పై లక్ష్యిత దాడులను ఇండియా విజయవంతం చేయగలిగింది.

More Telugu News