Narendra Modi: మోదీ కలల బుల్లెట్ ట్రైన్‌కు గోద్రెజ్ మోకాలడ్డు!

  • బుల్లెట్‌ ట్రైన్ ప్రాజెక్టుకు బాలారిష్టాలు
  • భూ సమీకరణపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన రైతులు
  • అలైన్‌మెంట్ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టు కెక్కిన గోద్రెజ్

ప్రధాని నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు అయిన బుల్లెట్ ట్రైన్‌కు బాలారిష్టాలు వేధిస్తున్నాయి. అహ్మదాబాద్-ముంబై మధ్య చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గోద్రెజ్ రూపంలో మరో అవాంతరం ఎదురైంది. ప్రాజెక్టులో భాగంగా ముంబై శివారులోని విఖ్రోలిలో ఉన్న గోద్రెజ్‌కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ప్రతిపాదన కారణంగా తమకు ఎంతో కీలకమైన 8.6 ఎకరాలు కోల్పోవాల్సి వస్తుందని పిటిషన్‌లో పేర్కొంది. కాబట్టి ప్రాజెక్టు అలైన్‌మెంట్ మార్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ నెల 31న ఇది విచారణకు రానుంది.

‌‌బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్రకు చెందిన రైతులు, గిరిజన సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రాజెక్టు పేరుతో భూ సమీకరణ చేయడాన్ని సవాలు చేస్తూ గుజరాత్‌కు చెందిన రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు గోద్రెజ్ కూడా మోకాలడ్డుతోంది. దీంతో ప్రభుత్వం ఎటవంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

కాగా, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య 508.17 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 21 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ ట్రాక్ ఉంటుంది. ఈ టన్నెల్ ఎంట్రీ పాయింట్లలో విఖ్రోలీ ఒకటి కావడం గమనార్హం.

More Telugu News