paripoornananda: భగవంతుడు నన్ను రాజకీయాల వైపు పంపితే వస్తా!: స్వామి పరిపూర్ణానంద

  • సైనికుడు సరిహద్దుల వద్ద చేసేది దేశ రక్షణ 
  • సన్యాసి ఇక్కడ చేస్తున్నది ధర్మ రక్షణ
  • ధర్మాగ్రహ యాత్రలో భాగంగా భక్తులందరూ ఒక్కటవుతారు
  • అగ్ర, నిమ్న వర్ణాలు అంటూ కొందరు చిచ్చుపెడుతున్నారు

సైనికుడు సరిహద్దుల వద్ద చేసేది దేశ రక్షణ అని, సన్యాసి ఇక్కడ చేస్తున్నది ధర్మ రక్షణ అని శ్రీ పీఠం అధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానంద అన్నారు. 'ధర్మాగ్రహ యాత్ర' పేరిట రేపటి నుంచి మూడు రోజుల యాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ 'ఈటీవీ-తెలంగాణ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అగ్ర వర్ణాలు, నిమ్న వర్ణాలు అంటూ వారి మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని అన్నారు.

'మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా?'... అన్న ప్రశ్నకు స్వామి పరిపూర్ణానంద సమాధానం చెబుతూ... ఇప్పటివరకు రాజకీయ నాయకులు ధర్మాన్ని నిలబెట్టే మంచి పనులు చేస్తే ఆ కార్యక్రమానికి తాను వెళ్లి వారి గురించి నాలుగు మాటలు మాట్లాడుతున్నానని అన్నారు. సమాజానికి మన అవసరం ఉందని, మన వల్ల మంచి జరుగుతుందని అనిపిస్తే ప్రకృతే మన చుట్టు రాజకీయాల్లోకి వెళ్లే వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. తన వల్ల మంచి జరుగుతుందని, చారిత్రక అవసరం ఉందని భగవంతుడు తనను రాజకీయాల వైపు పంపితే వస్తానని అన్నారు.  

ధర్మాగ్రహ యాత్రలో భాగంగా భక్తులందరూ ఒక్కటవుతారని, తమ లక్ష్యం ఎవరో ఒక వ్యక్తి కాదని, రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న దుర్మార్గపు ఆలోచనలపైనే తమ యుద్ధమని స్వామి పరిపూర్ణానంద అన్నారు. మతాలను కించ పరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పాకిస్థాన్‌ నుంచి ఎవరైనా చొరబడితే మన సైనికుడు తుపాకీతో వారిని తరిమికొట్టి దేశ రక్షణ చేస్తారని, అది తప్పుకాదని, అలాగే, హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాము పోరాడడం తప్పెలా అవుతుందని అన్నారు. 

More Telugu News