Madhya Pradesh: రేపిస్టుకు మరణశిక్ష.. మధ్యప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు.. కొత్త చట్టం తర్వాత ఇదే తొలిసారి!

  • తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం
  • చారిత్రక తీర్పు వెల్లడించిన కోర్టు
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం

ఈ ఏడాది మే 21న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని దోషిగా తేల్చిన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలంటూ గతేడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసింది.  ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో ఏప్రిల్ 21న చట్టంగా మారింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దోషికి ఉరిశిక్ష పడడం ఇదే తొలిసారి.

కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేరగాళ్లకు చెంపపెట్టు అవుతుందన్నారు. చిన్న పిల్లలపై అత్యాచారానికి పాల్పడేవారిని వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. ఇకపై అత్యాచారాలకు పాల్పడే వారి వెన్నులో వణుకుపుడుతుందన్నారు.

More Telugu News