Arrest: అప్పిచ్చి ఆదుకున్నాడు.. తీర్చలేదని బాలికను పెళ్లాడాడు!

  • ఐఏఎస్‌గా చలామణి అయిన యువకుడు 
  • అప్పు తీర్చలేని నిస్సహాయతను పసిగట్టి పెళ్లి చేసుకున్న వైనం 
  • పోలీసుల విచారణలో వధువు మైనర్ గా నిర్ధారణ 

కష్టాల్లో ఉన్న కుటుంబానికి అప్పిచ్చి ఆదుకున్నట్టు నటించిన ఓ వ్యక్తి, ఆపై అప్పు తీర్చలేదని ఆ ఇంటి బాలిక(16) ను పెళ్లాడాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అతడు తాను ఐఏఎస్‌నని నమ్మించడం గమనార్హం. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

 సేందమంగళానికి చెందిన గాంధీ కన్నన్ (33)కు తిరుచురాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన కుటుంబంతో పరిచయం ఏర్పడింది. తాను ఐఏఎస్‌ ఆఫీసర్ నని అందర్నీ నమ్మించాడు. తర్వాత ఆ కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉండడంతో కొంత డబ్బిచ్చి ఆదుకున్నాడు. ఆపై డబ్బు తీర్చలేని వారి నిస్సహాయతను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వారి కుమార్తెతో పెళ్లి జరిపిస్తే బాకీ తీర్చాల్సిన అవసరం లేదని చెప్పడంతో మరో మార్గం లేని తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు.

ఈ నెల ఐదో తేదీన ఓ గుడిలో బాల్య వివాహం జరుగుతున్న సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లేసరికే వివాహ తంతు పూర్తయి అందరూ వెళ్లిపోయారు. దీంతో బాలిక తల్లిని అధికారులు ఫోన్‌లో ఆరా తీశారు. తన కుమార్తెకు 19 ఏళ్లు నిండాయని, ఆమె మైనర్ కాదని చెప్పింది. అందుకు సంబంధించిన ధ్రువ పత్రాలను ఆలయ అధికారులకు సమర్పించామని చెప్పారు. దీంతో అధికారులు వాటిని తనిఖీ చేయగా నకిలీవని తేలింది. తర్వాత బాలిక స్కూలు రికార్డులను పరిశీలించగా ఆమె వయసు పదహారెళ్ళేనని తెలిసింది. దీంతో గాంధీ కన్నన్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన గాంధీ కన్నన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

More Telugu News