రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ భర్త.. తాట తీసిన భార్య!

07-07-2018 Sat 12:19
  • యాదాద్రి కలెక్టరేట్ లో ఏవోగా పని చేస్తున్న హరిప్రసాద్
  • రెండేళ్లుగా మరో మహిళతో అక్రమ సంబంధం
  • భర్తను చితకబాది, పోలీసులకు అప్పగించిన భార్య
మరో మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న భర్త తాట తీసిందో భార్య. ప్రియురాలితో ఉన్న భర్తను చితకబాదింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో చోటు చేసుకుంది. తన బంధువులతో కలసి భర్త ఉన్న చోటుకు వెళ్లిన భార్య... ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంతేకాదు, పోలీసులకు అప్పగించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె మోజులో తనను హింసిస్తున్నాడంటూ వాపోయింది. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని మండిపడింది. తన కుమారుడికి యాక్సిడెంట్ అయినా.. చూడ్డానికి రాకుండా రాత్రంతా ఆమెతోనే ఉన్నాడని చెప్పింది. తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

యాదాద్రి కలెక్టరేట్ లో ఏవోగా పనిచేస్తూ హరిప్రసాద్ ఇటీవలే సస్పెండ్ కూడా అయ్యాడు. నిర్మల అనే మహిళతో ఆయనకు 2002లో వివాహం జరిగింది. గత రెండేళ్లుగా వేరే మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే సమయంలో కుటుంబాన్ని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో, ఆయన బండారాన్ని భార్య నిర్మల బట్టబయలు చేసింది. భర్తకు దేహశుద్ధి చేసింది.