forest: వరంగల్ జిల్లాలో అటవీ శాఖ అధికారులపై 40 మంది గ్రామస్తుల దాడి.. పోలీస్ కేసు నమోదు!

  • వరంగల్ రూరల్ జిల్లాలో ఘటన
  • పాకాల అభయారణ్యం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అక్రమాలు
  • ట్రాక్టర్లతో భూమిని చదును చేస్తోన్న గ్రామస్తులు
  • అడ్డుకుని ట్రాక్టర్లను సీజ్ చేసే ప్రయత్నం చేసిన అధికారులు

గ్రామస్తులు అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పాకాల అభయారణ్యం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో చోటు చేసుకుంది. అక్కడ అక్రమంగా అటవీ భూమిని చదును చేస్తున్నవారిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకునేందుకు వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, చెరువు శిఖం పరిధిలో రిజర్వు అటవీ భూమిలోకి వచ్చే ప్రాంతంలో అశోక్ నగర్ గ్రామస్తులు కొందరు ట్రాక్టర్లతో చదును చేస్తున్న సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజు, బేస్ క్యాంపు సిబ్బంది అక్కడికి వెళ్లారు.

అక్రమ తవ్వకాన్ని అడ్డుకుని ట్రాక్టర్లను సీజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే, అడ్డగించిన గ్రామస్తులు అటవీ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. బేస్ క్యాంపు సిబ్బందిపై కూడా దాడి చేశారు. కొద్ది సేపట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, అటవీ శాఖ సిబ్బంది చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

30 నుంచి 40 మంది గ్రామస్తులు దాడిలో పాల్గొన్నారని, అశోక్ నగర్ సర్పంచ్ సాయిలు, ఉపేందర్ రెడ్డి తదితరులపై ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు చదును చేసేందుకు ప్రయత్నించిన భూమి పాకాల రిజర్వు అటవీ ప్రాంతమని, ఎకో టూరిజం ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

More Telugu News