New Delhi: ఎట్టకేలకు కేజ్రీవాల్ తో మాట్లాడేందుకు 'ఎల్జీ' అనిల్ బైజల్ అంగీకారం!

  • ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం
  • పాలన సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  • హాజరు కానున్న కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా

ఎట్టకేలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఓ మెట్టు దిగారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలను కలసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు అంగీకరించారు. సుప్రీం తీర్పు తరువాత పాలన సజావుగా సాగేందుకు సహకరించాలని కేజ్రీవాల్ ఓ లేఖను రాయగా, విభేదాలు సద్దుమణిగేలా వారిరువురూ చర్చించాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనిల్ బైజల్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తోంది.

బుధవారం నాడు కోర్టు తీర్పు ఇస్తూ, ఢిల్లీ ప్రజలను పాలించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమేనని, ఎల్జీ పర్యవేక్షకుడిగా ఉండాలే తప్ప, ప్రతి విషయానికీ అడ్డు పడరాదని తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అధికారుల బదిలీలు ప్రభుత్వం చేతుల్లో ఉంటాయన్న ఉత్తర్వులను మంత్రివర్గ సమావేశంలో జారీ చేయగా, వాటిని ఎల్జీ అడ్డుకున్నారు కూడా. ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ ల మధ్య విభేదాలు సమసిపోలేదని ఈ ఘటన స్పష్టం చేయడంతో, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించి, పాలన సజావుగా సాగుతుందన్న సంకేతాలను వారికి పంపాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే చర్చిద్దామని కేజ్రీవాల్ రాసిన లేఖపై ఎల్జీ సానుకూలంగా స్పందించడం గమనార్హం.

More Telugu News