Thailand: థాయ్ లాండ్ గుహలో చిక్కుకున్న వారికి... సాయం చేసేందుకు వెళ్లి ఆక్సిజన్ అందక మరణించిన నేవీ సీల్!

  • చిన్నారులకు ఆహారం తీసుకెళ్లిన నేవీ సీల్ మాజీ డైవర్
  • ఆక్సిజన్ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటగాళ్ల తల్లిదండ్రులు

థాయ్ లాండ్ యూత్ ఫుట్ బాల్ టీమ్ చిక్కుకున్న థామ్ లుయాంగ్ గుహల్లో ఘోరం జరిగింది. 12 మంది ఆటగాళ్లు, వారి కోచ్ ఈ గుహలో రెండు వారాల క్రితం చిక్కుకోగా, వారికి సాయపడేందుకు వెళ్లిన థాయ్ మాజీ నేవీ సీల్ ఆక్సిజన్ అందక మరణించారు. గతంలో థాయ్ లాండ్ నావికా దళంలో పనిచేసిన డైవర్, లోపలికి ఆహారాన్ని, మందులను తీసుకువెళుతూ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించినట్టు అధికారులు తెలిపారు.

గుహలో ఆటగాళ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లాలంటే, నావీ సీల్స్ బృందానికి కనీసం ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుండగా, వారిని జాగ్రత్తగా తేవాలంటే నెలల సమయం పడుతుందని అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ అధికారి మరణంతో గుహలో ఆక్సిజన్ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తల బృందం గాలి శాంపిల్స్ ను పరీక్షిస్తోంది. ఆటగాళ్లున్న ప్రాంతంలో ఆక్సిజన్ పుష్కలంగానే ఉందని అధికారులు చెబుతున్నా, వారి తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన నెలకొనివుంది.

More Telugu News