Manohar parrikar: నాకు కేన్సర్ అనగానే ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది!: గోవా సీఎం పారికర్

  • కేన్సర్ వస్తే ఒత్తిడికి దూరంగా ఉండాలి
  • నేనూ అదే సూత్రాన్ని పాటించా
  • మనోబలం, ఆత్మస్థైర్యం నాకు అండగా నిలిచాయి

పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లి వచ్చిన గోవా ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ ఇటీవలే తిరిగి ముఖ్యమంత్రి విధుల్లో చేరారు. కేన్సర్ నుంచి తాను ఎలా బయటపడిందీ.. అందుకు తానేం చేసిందీ గురువారం ఆయన వివరించారు. తనకు కేన్సర్ అని వైద్యులు చెప్పగానే  ఒక్కసారిగా ఒళ్లు జలదరించిందన్నారు. మనసులో అలజడి చెలరేగిందని గుర్తు చేసుకున్నారు. 'విషయం తెలిసి కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు. అయితే, తొలుత భయపడినా తర్వాత నేను ధైర్యం తెచ్చుకున్నా. భయాన్ని దూరంగా నెట్టేశా. నాకు నేనే సర్ది చెప్పుకున్నా' అని పారికర్ వివరించారు.

తనను ఆదర్శంగా తీసుకునే వాళ్లు ఎందరో ఉన్నారని, వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉండడంతో ధైర్యం తెచ్చుకున్నానని పేర్కొన్నారు. తాను సీఎంననే విషయం గుర్తుకు వచ్చిందని, తాను దృఢంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నిర్ణయించుకున్నానని చెప్పారు. ‘‘ఆ ఆలోచన మనసులోకి రాగానే మనోబలం, ఆత్మస్థైర్యం నాకు అండగా నిలిచాయి. అవే నన్ను కేన్సర్ నుంచి బయటపడేశాయి’’ అని పారికర్ గుర్తు చేసుకున్నారు. కేన్సర్ సోకిన వారు ఒత్తిడికి గురికాకూడదని, తాను కూడా అదే సూత్రాన్ని పాటించి బయటపడ్డానని తెలిపారు.  
 
రెండు రోజుల క్రితం బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తనకు కేన్సర్ సోకినట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం.. ఆమె ధైర్యవంతురాలు కాబట్టే ఆ విషయాన్ని స్వయంగా చెప్పగలిగారని ప్రశంసించారు. కేన్సర్‌తో తాను ధైర్యంగా పోరాడతానని చెప్పడం అభినందనీయమని పారికర్ పేర్కొన్నారు. 

More Telugu News