isro: ఇస్రో మరో ఘనత.. 'వ్యోమగాముల ఎస్కేప్' ప్రయోగం విజయవంతం!

  • మానవ రహిత రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో
  • రాకెట్ నుంచి ప్యారాచూట్ సాయంతో కిందకు దిగిన మాడ్యూల్ 
  • 300లకు పైగా సెన్సర్లతో ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఛైర్మన్

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపినప్పుడు, సాంకేతిక సమస్య ఏర్పడి, అత్యవసర పరిస్థితులలో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే మార్గాన్వేషణలో తొలి విజయం సాధించింది. ఈ ఉదయం షార్ లో చేపట్టిన క్రూ ఎస్కేప్ సిస్టం ప్రయోగం విజయవంతమైంది. 

శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఓ చిన్న రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ (వ్యోమగాములు ఉండే గది)ని అంతరిక్షంలోకి శాస్త్రవేత్తలు ప్రయోగించారు. అనంతరం షార్ కు మూడు కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలో రాకెట్ నుంచి మాడ్యూల్ విజయవంతంగా విడిపోయేలా చేశారు. ఆ తర్వాత అది ప్యారాచూట్ సాయంతో బంగాళాఖాతంలో దిగింది.

రాకెట్ ప్రయోగంలో ఏదైనా ప్రమాదం సంభవించిన సమయంలో అందులో ప్రయాణించే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అంతరిక్ష యాత్రలు వాణిజ్య స్థాయికి చేరుకుంటున్న తరుణంలో... ఇస్రో మానవసహిత ప్రయోగాలపై దృష్టిని సారించింది. 300లకు పైగా సెన్సర్లతో ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ పర్యవేక్షించారు.

More Telugu News